న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రశంసలు
ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ ఠాకూర్‌కు వీడ్కోలు పలికేందుకు న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తొలుత ప్రసంగిస్తూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ ఠాకూర్ అందించిన సేవలను కొనియాడారు. ‘జస్టిస్ ఠాకూర్ ఏపీ హైకోర్టులో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. జ్యుడీషియల్ అకాడమీ, హైకోర్టు జడ్జిల అతిథి గృహాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. 38 కోర్టు భవనాలను ప్రారంభించారు.
అలాగే న్యాయవ్యవస్థలో పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టారు. 3,482 పోస్టులను భర్తీ చేశారు. న్యాయాధికారుల ఖాళీలను సైతం భర్తీ చేశారు’ అని పేర్కొన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథరెడ్డి ప్రసంగించారు.
కార్యక్రమంలో జస్టిస్ ఠాకూర్ కుటుంబ సభ్యులు, అదనపు ఏజీ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, పలువురు ప్రభుత్వ న్యాయవాదులు, హైకోర్టు న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జస్టిస్ ఠాకూర్ దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం శాలువాలతో సత్కరించి, చిత్ర పటాన్ని బహూకరించింది
స్వతంత్ర న్యాయ వ్యవస్థ పౌరుడి హక్కు
చీఫ్ జస్టిస్ ఠాకూర్ భావోద్వేగ ప్రసంగం
కార్యక్రమం చివరిలో జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడటానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 5 నిమిషాల పాటు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. అనంతరం ఆయన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతోనే కొనసాగింది. స్వతంత్ర న్యాయవ్యవస్థ అన్నది న్యాయమూర్తి ప్రత్యేక హక్కు కాదని, అది ఈ దేశ పౌరుడి హక్కు అని చెప్పారు.

న్యాయవ్యవస్థ విలువను కాపాడటానికే తాను ప్రయత్నించానని తెలిపారు. తాను న్యాయవాద వృత్తిని ఓ జీవన విధానంగా భావించిన కుటుంబంలో జన్మించినందుకు అదృష్టవంతుడినన్నారు. తన తండ్రి, సోదరుడి రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించే విషయంలో సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, హైకోర్టు అధికారులు, ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
నేడు సీజేగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణం చేయనున్నారు. శనివారం సాయంత్రం విజయవాడలోని లోక్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆమెతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్ గిల్ కుటుంబసభ్యులు, బంధువులు, న్యాయవాదులు పాల్గొననున్నారు. న్యాయమూర్తుల గౌరవార్థం గవర్నర్ జస్టిస్ నజీర్ విందు ఏర్పాటు చేశారు.


