‘ఆదాయ పత్రం’ గడువు నాలుగేళ్లకు పెంపు

Rice Cards Itself Now Income Certificate In AP - Sakshi

బియ్యం కార్డే ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌ 

ప్రజల ఇబ్బందులు తొలగింపే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం

ఫైలుపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తొలి సంతకం

సాక్షి, అమరావతి: బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని, కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్‌ సర్టిఫికెట్‌) కాలపరిమితిని ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్‌ ఈమేరకు ఫైలుపై తొలి సంతకం చేశారు. దీంతో బియ్యం కార్డుదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని ఉండదు. ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు.

నిరాడంబరంగా బాధ్యతల స్వీకరణ
ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ధర్మాన కృష్ణదాస్‌ శనివారం పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవివి.
►సీఎం వైఎస్‌ జగన్‌ కీలకమైన రెవెన్యూ,  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు. సీఎం ఆశయ సాధన కోసం పనిచేస్తా. 
►భూ వివాదాల పరిష్కారానికి భూముల సమగ్ర రీసర్వే చేపడతాం. 
►పేదలందరికీ సొంతిల్లు ఉండాలనే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం మేరకు ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వనున్నాం.
►రెవెన్యూ శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు అధికారులు సత్వర పరిష్కారాలు చూపాలి.
►రెవెన్యూ శాఖలో సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

బియ్యం కార్డు చాలు
బియ్యం కార్డు ఉన్న వారిని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలేవీ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శనివారం జీఓ జారీ చేశారు. జీఓలోని ముఖ్యాంశాలివీ..
► ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవి బియ్యం కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డులున్న వారిని దారిద్య్రరేఖకు దిగువనున్న (బీపీఎల్‌) కుటుంబాలుగా పరిగణించాలి. 
► ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు బీపీఎల్‌ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహించే ఎంపిక కార్యక్రమాలకు బియ్యం కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు.
► తెల్లరేషన్‌ కార్డు లేని వారికి అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం నాలుగేళ్లపాటు చెల్లుబాటవుతుంది.
► ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఒరిజనల్‌ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నోట్‌ చేసుకుని తక్షణమే సంబంధితులకు వెనక్కు ఇవ్వాల్సిందే. 
► స్కాలర్‌ షిప్‌ల మంజూరు సమయంలో మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి. రెన్యువల్‌కు వీటిని అడగరాదు.
► ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం ప్రభుత్వం జారీ చేసిన నమూ నాలో ప్రజలు రూ.10 నాన్‌ జ్యుడీషి యల్‌ స్టాంపు పేపరుతోపాటు మూడు కాపీలు తహసీల్దారు కార్యాలయంలో సమర్పించాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top