కాకినాడ జిల్లా వంతాడ ప్రాంతంలో భారీగా అక్రమ మైనింగ్
లేటరైట్ అక్రమ తవ్వకాలతో తరిగిపోతున్న కొండ
లీజు హద్దులు దాటి అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు
ఎక్సకవేటర్ల గర్జన.. 50 టిప్పర్లలో నిత్యం అక్రమ రవాణా
రోజుకు 35 వేల నుంచి 45 వేల టన్నులు తరలింపు
21 నెలల్లో లక్షల టన్నుల విలువైన ఖనిజం మాయం
ముఖ్య నేత అండతో రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ
కొండ మాయమవుతుండడంతో పర్యావరణానికి తీవ్ర ముప్పు
ఆందోళనలో వంతాడ గిరిజన ప్రజలు
సాక్షి, అమరావతి: కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న లేటరైట్ అక్రమ తవ్వకాలతో నాగులకొండ కరిగిపోతోంది. కొండ మీద, పరిసరాల్లో విస్తరించి ఉన్న రిజర్వు ఫారెస్టు సైతం కుంచించుకుపోతోంది. అధికారమే అండగా మైనింగ్, అటవీ, పర్యావరణ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అక్రమార్కులు యథేచ్ఛగా లేటరైట్‌ను తవ్వి అమ్మేసుకుంటున్నారు. తవ్వకాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ కొండ కనుమరుగు అవుతుందని అక్కడి గిరిజనులు వాపోతున్నారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ప్రాంతం వంతాడ సమీపంలోని గిరిజనాపురంలో ఉన్న నాగుల కొండను చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇష్టానుసారం కొల్లగొడుతున్నారు. ముఖ్య నేత అండతో 2014–19 మధ్య కనీవినీ ఎరుగని స్థాయిలో లేటరైట్, బాక్సైట్‌ను తవ్వి రూ.వందల కోట్లు దోచుకున్నారు. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసింది. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడంతో తవ్వకాలు మొదలై ఇప్పుడు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.
లీజు పరిధిని మించి తవ్వకాలు
ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి ఉన్న ఎనిమిది లీజుల పరిధిలో 200 ఎకరాలతోపాటు పక్కనున్న కొండను కూడా ఇష్టం వచ్చినట్లు తొలచి వేస్తున్నారు. లీజు పరిధిని దాటి బయట ప్రాంతాల్లోనూ తవ్వకాలు చేస్తున్నారు. పక్కనే ఉన్న అటవీ భూములను కూడా తవ్వేసి.. ఆ గుంతల్లో మొక్కలు నాటుతున్నారు. లీజు పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకెళ్లి, పరిమాణానికి మించి మట్టి తవ్వేస్తున్నారు. వాస్తవానికి తవ్వకాలు జరుగుతున్న తీరును బట్టి నిర్దిష్ట పరిమాణానికి మించి ఎన్నో రెట్ల తవ్వకాలు జరుగుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు.
రోజుకు వెయ్యి ట్రిప్పులు
ప్రస్తుతం తవ్వకాలకు నాలుగు భారీ ఎక్సకవేటర్లు, లోడర్లను వినియోగిస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్లలో లేటరైట్‌ను సమీపంలోని రావికంపాడు, అరళ్ల«దార వద్ద ఏర్పాటు చేసిన యార్డులకు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 50 టిప్పర్లను వినియోగిస్తూ.. ఒక్కో టిప్పర్ 20కి పైగా ట్రిప్పులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నిత్యం వెయ్యి ట్రిప్పుల లేటరైట్‌ను తవ్వి తీస్తున్నారు. రావికంపాడు రైల్వే వ్యాగన్ ద్వారా లేటరైట్‌ను ఇతర ప్రాంతాల్లోని సిమెంటు ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 30 టన్నుల లేటరైట్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా, మరో 10 టన్నులు అదనంగా వేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌లో లేటరైట్ టన్ను ధర గ్రేడ్‌ను బట్టి రూ.800 నుంచి రూ.1,200 వరకూ ఉంది. ఈ లెక్కన ఒక్కో ట్రిప్‌కు రూ.35 వేల నుంచి రూ.45 వేల చొప్పున.. రోజులో మొత్తంగా రూ.3.5 కోట్ల విలువైన 35 వేల టన్నుల నుంచి 45 వేల టన్నుల లేటరైట్‌ను తవ్వుతున్నారు. మధ్యలో వర్షాలు, ఇతర అడ్డంకుల వల్ల తవ్వకం ఆగినా, మిగిలిన సమయాల్లో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. తవ్వకం, రవాణా, ఇతర ఖర్చులన్నీ పోనూ 21 నెలలుగా ఇలా రూ.వెయ్యి కోట్లకుపైనే దోచేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం 4 క్రషర్లు కూడా వినియోగిస్తున్నారు.
లింగంపర్తి అడవి కనుమరుగేనా!
లేటరైట్ తవ్వకాలతో లింగంపర్తి రిజర్వు ఫారెస్టు రూపురేఖలే మారిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. గతంలో పచ్చదనంతో కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు ఎటు చూసినా ఎర్రమట్టి లోయగా మారిపోయింది. దుమ్ము, ధూళితో చెట్లు పెరిగే అవకాశం లేకుండా పోతోంది. తవ్వకాలతో భూగర్భ నీటిమట్టం కూడా తగ్గిపోతోందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఈ తవ్వకాలతో కొండపైన ఉన్న వంతాడ గిరిజన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ సమయంలో వారి రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు. స్థానికులకు ఉపాధి కూడా దొరకడం లేదు. తవ్వకాలతో ఈ కొండ రోజురోజుకూ తరిగిపోతున్న నేపథ్యంలో తాము ఎక్కడికెళ్లాలని కొండపై ఉంటున్న గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్య నేత అండదండలు
ముఖ్య నేత అండదండలతోనే నాగుల కొండపై భారీ తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లీజుదారుల కుటుంబంలోని కీలక వ్యక్తి చినబాబుకు అత్యంత సన్నిహితుడని సమాచారం. పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు లీజుదారులతో కుమ్మక్కై ఈ దోపిడీని నిరాఘాటంగా జరిపిస్తున్నారు. అందుకే అక్రమ తవ్వకాలు ఊహించని రీతిలో జరుగుతున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రిజర్వు ఫారెస్టును కొల్లగొడుతున్నా అటవీ శాఖ అక్కడ ఏమీ జరగనట్లే వ్యవహరిస్తోంది.


