మింగేస్తున్న మా‘రీచులు’.. ఇసు‘కాసులు’! | Illegal sand mining with machinery from Uttarandhra to Rayalaseema | Sakshi
Sakshi News home page

మింగేస్తున్న మా‘రీచులు’.. ఇసు‘కాసులు’!

Apr 21 2026 4:41 AM | Updated on Apr 21 2026 4:41 AM

Illegal sand mining with machinery from Uttarandhra to Rayalaseema

శ్రీకాకుళం జిల్లా మడపాం వద్ద వంశధార నదిలో పొక్లెయినర్లతో ఇసుక అక్రమ తవ్వకాలు

ప్రకృతి వనరులను చెరబట్టి కొల్లగొడుతున్న పచ్చముఠాలు

వాగులు, వంకలు, చెరువులు, నదులను ఆక్రమించి దోపిడీ

ఉత్తరాంధ్ర నుంచి సీమ దాకా యంత్రాలతో యథేచ్ఛగా అక్రమంగా ఇసుక తవ్వకాలు

డీసిల్టేషన్‌ ముసుగులో జేసీబీల ద్వారా తవ్వి తరలింపు

ఎన్జీటీ ఆదేశాలు ఇసుకలో తొక్కి నదుల్లోకి నేరుగా రోడ్లు నిర్మాణం

విచ్చలవిడిగా తవ్వకాలతో నీరు అందక పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయంటూ రైతుల ఆందోళన

ఇసుక దందాలో గ్రామ స్థాయి నుంచి ‘ముఖ్య’ నేత దాకా వాటాల వసూళ్లు  

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాంలో పొక్లెయినర్లు, జేసీబీలతో వంశధారను కుళ్లబొడిచి విశాఖపట్నం తదితర చోట్లకు టిప్పర్లలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లో యథేచ్ఛగా దందా సాగుతోంది. అక్రమ రవాణాకు అడ్డు లేకుండా సరిహద్దు చెక్‌ పోస్టులను మూసేశారు. నకిలీ బిల్లుల తయారీకి ప్రత్యేక డివైజ్‌లు సృష్టించి ఖజానాకు గండికొడుతున్నారు.

పచ్చ ముఠాల ఇసుక దోపిడీకి సజీవ సాక్ష్యమిది. విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి మండలం కందిశ – తునివాడ గ్రామాల మధ్య నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. నదిలో యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వడంతో రేగిడి బట్టి ఓపెన్‌ చానల్‌కు నీరు అందక పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు చేస్తున్న పొక్లెయినర్‌కు అడ్డంగా నిలబడి రైతులు నిరసన తెలిపారు. నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధి తీరుపై మండిపడ్డారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పచ్చముఠాల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతోంది. గోదావరి, కృష్ణా, నాగా­వళి, వంశధార, పెన్నా లాంటి నదులతో పాటు చెరువులనూ చెరపడుతున్నారు. నదీమ తల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. డీసిల్టేషన్‌ ముసుగులో నదులను కబళించి అధికార పార్టీ నాయకులు జేబు­లు నింపుకొంటున్నారు. మంత్రులు, కూటమి పార్టీ­ల ఎమ్మెల్యేలు, వారి బంధువులు, అనుచరుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. దోచుకున్న సొ­మ్మును వాటాలేసుకుని పంచుకుంటున్నారు. అడ్డుపడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. భౌతిక దాడులకూ వెనుకాడకుండా బరితెగిస్తున్నారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ ని­యోజకవర్గంతోపాటు మరో మంత్రి సత్యకుమార్‌ గెలుపొందిన ధర్మవరంలోనూ ఇసుక దందా భారీ­గా జరుగుతోంది. గ్రామ స్థాయి నేత నుంచి ‘ముఖ్య’ నేత దాకా ఇందులో భాగస్వామ్యం కావడంతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది.

డీసిల్టేషన్‌ ముసుగులో లూటీ..
వరదలతో నదులలో ఏర్పడిన మేటలను డీసిల్టేషన్‌ ద్వారా మాన్యువల్‌గా మాత్రమే తొలగించాలి. ఇలా తొలగించిన ఇసుకను ఒకచోట డంప్‌ చేసి వినియోగదారుల అవసరాలకు విక్రయించాలి. స్టాక్‌ పాయింట్‌ నుంచే లారీలకు లోడింగ్‌ చేసి పంపించాలి. కానీ డీసిల్టేషన్‌ పేరుతో నదిలో జేసీబీల ద్వారా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. నదిలోనే లారీల్లో లోడింగ్‌ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన ఇసుక ర్యాంపుల్లో మీటరు లోతులో మాత్రమే తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా 5 నుంచి 20 మీటర్ల వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి, టన్నుల కొద్దీ నదిలోనే పోగేసి, అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డీసిల్టేషన్‌ పాయింట్లలో ఎంత పరిమాణంలో తవ్వారో లెక్కలు ఉండాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేదు. టీడీపీ నాయకుల అజమాయిషీలో ఆ పాయింట్లన్నీ ఉండటంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వరద నీటితో నదులు ఉప్పొంగిన సమయంలోనూ అక్రమ తవ్వకాలు ఆగడం లేదు.

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్‌..
నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తూ నదుల్లోకి నేరుగా రోడ్లు నిర్మించారు. నదీ గమనాన్ని మార్చేస్తూ నీటిని దారి మళ్లించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయేలా నదులను కబళిస్తున్నారు. దీంతో నదుల స్వరూపమే మారిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇసుక లోడ్‌ లారీల వల్ల రహదారులన్నీ శిధిలమైపోతున్నాయి. భారీ గుంతలతో రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. 

ఉత్తరాంధ్రలో బాబాయ్‌–అబ్బాయ్‌ అండతో..
ఉత్తరాంధ్రలో బాబాయ్‌–అబ్బాయ్‌ అండతో ఇసుక అక్రమ దందా మూడు పొక్లెయిన్లు ఆరు టిప్పర్లు అన్నట్లుగా సాగుతోంది. శ్రీకాకుళం మండలం పొన్నాం, బట్టేరు, నైరా, భైరి, కరుజాడ, గారలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నాగావళిని కిల్లిపాలెంలో తోడేస్తున్నారు. ఆమదాలవలస, నరసన్నపేటలో అడ్డు అదుపు లేకుండా యంత్రాలతో ఇసుక దోపిడీ సాగుతోంది. పార్వతీపురం పరిధిలో సువర్ణముఖి నది నుంచి ఇసుకను లూటీ చేస్తున్నారు. సీతానగరం మండలం గెడ్డలుప్పి, సీతానగరం, చిన్న భోగిలి, లక్ష్మీపురం, బూర్జ, పెదంకలాం రేవుల నుంచి ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. పాలకొండ మండలం గోపాలపురం, చిన్నమంగళాపురం, అంపిలి ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. భామిని మండల పరిధిలో వంశధార తీరమంతా అక్రమ తవ్వకాలే. ఇక్కడ కూటమి నేతదే హవా.

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం చిత్రావతి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి, టిప్పర్లతో తరలిస్తున్న దృశ్యం 

‘గోదావరి’ గుండె చెరువు..
గోదావరి జిల్లాల్లో పచ్చముఠాల మధ్య వాటాలు తేలకపోవడంతో చినబాబు డైరెక్షన్‌లో ఇసుక పంచాయతీలు జరుగుతున్నాయి. రావులపాలెం మండలం ఊబలంక, ఆలమూరు మండలం జొన్నాడ ర్యాంపుల్లో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పి.గన్నవరం పరిధిలో ఉడిమూడిలంక, వైవీపాలెం, అయినవిల్లిలంక, ఆత్రేయపురంలోని బొబ్బర్లలంక, రాజోలు మండలం సోంపల్లి, ఐ.పోలవరం మండలం మురమల్ల, అల్లవరం మండలం బోడసకుర్రుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం, తాళ్లపూడి, చిడిపి, రాజమండ్రి సిటీ కోటిలింగాల పేట ఇసుక రేవులు, సీతానగరం మండలంలో రెండు ఇసుక ర్యాంపుల్లో రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు.

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ర్యాంపులో ఇసుక అక్రమ తవ్వకాలు 

‘కృష్ణా’లో కొల్లగొట్టేస్తున్నారు..
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం లంకపల్లి, రొయ్యూరు, నార్త్‌ వల్లూరు అక్రమ ర్యాంపుల్లో ఇసుక దొంగలు దోచుకుంటున్నారు. రోజుకు 150 లారీల ఇసుక తరలిపోతోంది. అవనిగడ్డ నియో­జకవర్గం పాపవినాశనంలో రోజుకు సుమారు 100 నుంచి 150 లారీలు ఇసుక తరలిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం నుంచి రోజుకు 300 నుంచి 350 లారీల వరకు తరలిపోతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం చిట్యాల, లింగాల, పోలంపల్లి, ముక్త్యాల, సుబ్బాయగూడెం, పెనుగంచిప్రోలు, నందిగామ నియోజకవర్గం కీసర, గండేపల్లి, మొగులూరు, వేములపల్లి, గడ దేవరపాడు, వెల్లంకి, కొండూరు, కొడవటికల్లు, పొక్కునూరు, కాసారాబాద, పల్లగిరి, కమ్మవారిపాలెంలో పెద్ద ఎత్తున యంత్రాల సాయంతో అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని చోడవరంలో తవ్వకాలు జరిపి, టిప్పర్లలో రవాణా చేస్తున్న దృశ్యం  

గుంటూరులో పచ్చ గునపం..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల కనుసన్నల్లో దోపిడీ సాగిపోతోంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి–గుండిమెడలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పగలు మనుషులతో, రాత్రి యంత్రాలతో తవ్వేస్తున్నారు. అమరావతి మండలంలో ఎనిమిది రీచ్‌లు ఉండగా మల్లాది రీచ్‌లో మాత్రమే అధికారికంగా తవ్వకాలు చేపడుతున్నారు. అచ్చంపేట మండలం చింతపల్లి, బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం పందిళ్లపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు.

నెల్లూరు, ప్రకాశంలో ఇష్టారాజ్యం..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ప్రధానంగా పాలేరు పరీవాహక ప్రాంతంలో జరుగుమల్లి, కె.బిట్రగుంట, రావులకొల్లు, ఉప్పలదిన్నె పరిధిలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఉదయం మనుషుల ద్వారా, రాత్రి పూట జేసీబీలతో తవ్వేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గం రామాపురం పరిధిలో గుండ్లకమ్మ నదిలో తాగునీటి ఊట బావులకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారికంగా ఇసుక రీచ్‌ లేదు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పోలవరంలో అక్రమ రవాణా జరుగుతోంది. దర్శి టీడీపీ నేత లక్ష్మి పొలాలు కొనుగోలు చేసి అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. 

సీమలో యథేచ్ఛగా దోపిడీ
రాయలసీమలో అడిగే నాథుడే లేడన్న ధోరణిలో ఇసుకను దోచుకుంటున్నారు. కడప నగరానికి సమీ­పంలోని సిద్దవటం సమీపంలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. రాజంపేట పరిధిలోని బాలరాచపల్లి, మందరం ప్రాంతంలో చెయ్యేరు నుంచి యంత్రాలతో తోడుతూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పాపాఘ్ని నది, కొండాపురం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చక్రాయపేట మండలంలో పాపాఘ్ని నది నుంచి పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. లింగాల మండలం వేంపల్లెలో పాపాఘ్ని  నుంచి ఇసుక తరలిపోతోంది. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం చిత్రచేడు సమీపంలో పెన్నా నదిలో ఇసుకను భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. పుట్టపర్తి చుట్టుపక్కల చిత్రావతిని తోడేస్తున్నారు. 


తిరుపతి రూరల్‌ మండలం దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, పెడిపల్లి, చిగురువాడ, కేసీపేట, వేదాంతపురం, తణపల్లి, తిరుచానూరు ప్రాంతాల్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు, ఎం.కొత్తపల్లి, మామండూరు, ఐతేపల్లి, నాగయ్యగారిపల్లి, రెడ్డివారిపల్లి, నరసింగాపు­రం, బుచ్చినాయుడుపల్లి, తొడంవాడ, శానంబట్ల ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించి ఇసు­క తవ్వకాలు చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం నాగులాపురం మండలం చిన్నాపట్టు, పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు వద్ద అరుణా నది వద్ద రెండు చోట్ల జేసీబీలతో ఇసుక లోడింగ్‌ జరుగుతోంది. ఈ రెండు గ్రామాల నుంచి పెద్దఎత్తున తమిళనాడుకు నిత్యం ఇసుకను తరలిస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement