కరోనా కాలంలో ఖాకీల కారుణ్యం 

Funeral with courtesy of police for corona bodies - Sakshi

కృష్ణా జిల్లాలో కరోనా మృతదేహాలకు పోలీసుల సౌజన్యంతో అంత్యక్రియలు 

సాక్షి, అమరావతి: కరోనాతో మృతి చెందిన వారిని అయిన వాళ్లే వదిలేసినా..వారి అంత్యక్రియలను పోలీసులు అన్నీ తామై చేయిస్తూ మానవత్వం ఖాకీ యూనిఫాం రూపంలో ఉందని నిరూపిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి చెందిన షేక్‌ సుభాని(35)కు కరోనా కారణంగా ఊపిరి ఆడకపోవడంతో మంగళవారం అంబులెన్సులో తరలిస్తున్న క్రమంలో ఆయన మృతి చెందారు. దీంతో అంబులెన్స్‌ సిబ్బంది మృతదేహాన్ని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. సుభానిని అయిన వారు సైతం పట్టించుకోకపోవడంతో 2 గంటల పాటు రోడ్డు పక్కనే మృతదేహం ఉండిపోయింది.

విషయం తెలుసుకున్న తిరువూరు సీఐ శేఖర్‌బాబు, ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని వెలుగోటి యూత్‌ సభ్యులకు అప్పగించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.  అలాగే, కంచికచర్ల మండలం గండేపల్లిలో 10 రోజులుగా మతిస్థిమితం లేకుండా యాచక వృత్తి చేసుకుంటూ తిరుగుతోన్న వృద్ధురాలు సోమవారం మృతి చెందగా ఆమె అంత్యక్రియలను ఎస్‌ఐ రంగనాథ్‌ నేతృత్వంలో సిబ్బంది, గ్రామస్తులు నిర్వహించారు. ముసునూరు మండలం గోపవరంలో సోమవారం మరణించిన ఒక వృద్ధుడికి, సూరేపల్లి దిబ్బగూడెంలో మంగళవారం మృతి చెందిన వృద్ధురాలికి ఎస్‌ఐ రాజారెడ్డి నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. మచిలీపట్నంలోని లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌లో ఒక మహిళ మంగళవారం ఎండకు సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోగా చిలకలపూడి ఎస్‌ఐ నాగేంద్ర, ఏఎస్‌ఐ బలరాం, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ హర్ష వచ్చి ఆమెను రోడ్డు పైనుంచి తీసి బెంచిపై కూర్చోబెట్టి నీళ్లు పట్టించి సపర్యలు చేశారు. అనంతరం ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top