సత్తెనపల్లి, నరసరావుపేటలో సహజ వనరుల దోపిడీ
మట్టి, కంకర, గ్రానైట్ అక్రమంగా తరలించేస్తున్న టీడీపీ నాయకులు
స్థానిక ప్రజాప్రతినిధుల అనుచరుల ఆధ్వర్యంలో భారీగా అక్రమ మైనింగ్
నరసరావుపేట రూరల్ మండలంలో జోరుగా గ్రావెల్ దందా
త్రిపురాపురం కొండల్లో వందలాది ట్రక్కులతో ‘కన్నా’ అనుచరుల ఎర్రమట్టి అక్రమ రవాణా
దోపిడీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు రాసినా పట్టించుకోని ప్రభుత్వ అధికారులు
టీడీపీ నేతల అక్రమ మైనింగ్‌పై ఆ పార్టీ నేత కోడెల శివరామ్ ఫిర్యాదు చేసినా కదలని యంత్రాంగం
అధికారం అండతో సాగుతోన్న దోపిడీపై మండిపడుతున్న ప్రజలు
సాక్షి, నరసరావుపేట: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పల్నాడు జిల్లాలో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. మట్టి, కంకర, ఎర్రమట్టి, గ్రానైట్... ఏది దొరికితే దాన్ని కొల్లగొడుతున్నారు. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రజాధనం దోచుకుంటున్నా నిబంధనలన్నీ పచ్చ చొక్కాలకు దాసోహమవుతున్నాయి. అధికార పార్టీ దురహంకారం ముందు చట్టాలన్నీ మూగబోతున్నాయి. అధికారుల నోళ్లకు మామూళ్ల తాళాలు పడటంతో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో సహజ వనరుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది.
నిత్యం వందలాది ట్రక్కుల మట్టి, కంకర, గ్రానైట్‌ను టీడీపీ ప్రజాప్రతినిధుల అనుచరులు అక్రమంగా రవాణా చేసి రూ.కోట్లతో జేబులు నింపుకొని ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం, అధికారులలో ఏమాత్రం చలనం లేదు. ఈ అక్రమ దోపిడీపై సాక్షితోపాటు పలు పత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమైనా పట్టించుకున్న పాపానపోలేదు. ఏకంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తనయుడు టీడీపీ ముఖ్యనేత కోడెల శివరామ్ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేవరకు వెళ్లిందంటే అక్రమ మైనింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో ఆర్థం చేసుకోవచ్చు.
అదే విధంగా జనసేన పార్టీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి సయ్యద్ జిలానీ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెచ్చుమీరిందని... డబ్బులిస్తేనే ఏ పని అయినా జరుగుతోందని బహిరంగంగా విమర్శించారు. కూటమి పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నా ఇటు ప్రభుత్వంలో... అటు అధికారులలో ఏమాత్రం చలనం లేదు.
సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యేలతో దోపిడీ
కన్నా లక్ష్మీనారాయణ ఎమ్యెల్యేగా గెలిచిన రోజు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమార్జనకు తెరదీశారు. సత్తెనపల్లి, నకరికల్లు మండలాలకు చెందిన ఇద్దరు నాయకులను షాడో ఎమ్మెల్యేలను నియమించుకొని దోపిడీకి గేట్లు తెరచారు. ముఖ్యంగా త్రిపురాపురం కొండల్లో నిత్యం వందలాది ట్రక్కుల ఎర్రమట్టి అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీనిపై గతంలో పలుమార్లు పత్రికల్లో కథనాలు ప్రచురించగా తనిఖీలకు వెళ్లిన అధికారులు... అక్రమ మైనింగ్ జరగలేదంటూ క్లీన్ చిట్ ఇస్తూ సహకరిస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదే అంశంపై కన్నా లక్ష్మీనారాయణ, ఇద్దరు షాడో ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిపై కోడెల శివరామ్ ప్రధానంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సత్తెనపల్లి నియోజకవర్గం మీదుగా వెళ్లే గ్రానైట్ లారీల నుంచి నెల వారీ మామూళ్లు సుమారు రూ.40 లక్షలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. పట్టణం నడి»ొడ్డున షాడో ఎమ్మెల్యే పేకాట క్లబ్‌ను ఏర్పాటు చేసి మరీ నిత్యం రూ.లక్షల్లో డబ్బు సంపాదిస్తూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల పోటాపోటీ
నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబు వర్గాలుగా విడిపోయి దోపిడీకి పాల్పడుతున్నారు. కోటప్పకొండ పరిసరాల్లో అక్రమంగా మట్టి, గ్రానైట్ తవ్వకాలతో చదలవాడ అరవింద్‌బాబు అనుచరులు అక్రమార్జన చేస్తున్నారు.
వీరికి పోటీగా ములకలూరు గ్రామ పరిధిలోని వాగు పోరంబోకు భూముల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్గీయులు కార్యాలయ నిర్మాణం పేరుతో జోరుగా మట్టి తవ్వకాలు జరిపారు. ఇదే అంశంపై ఇరువర్గాలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టుకున్నారు. నరసరావుపేటలో జరుగుతున్న అక్రమాలపై ఫొటోలతో సహా ఆధారాలను కోడెల శివరామ్ కలెక్టర్‌కు ఇచ్చినట్టు తెలుస్తోంది.
కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే కన్నా..!
పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై టీడీపీ నేత కోడెల శివరామ్ ఏకంగా ఎనిమిది పేజీల లేఖను జిల్లా కలెక్టర్‌కు అందించినట్టు తెలిసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేలు చేసిన అక్రమ మైనింగ్, కోట్ల రూపాయల అవినీతిపై ఆధారాలను కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. దీంతో దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో అక్రమమైనింగ్‌ను నిలిపివేశారు. శివరామ్ ఫిర్యాదుతో కంగుతిన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, షాడో ఎమ్మెల్యేగా పేరొందిన దరువూరి నాగేశ్వరరావు తాజాగా పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాను కలిసినట్లు సమాచారం. శివరామ్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించినట్టు తెలుస్తోంది.


