రాష్ట్రంలో 26 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల అభివృద్ధి

Development of 26 MSME clusters in Andhra Pradesh - Sakshi

ఇప్పటికే 5 క్లస్టర్ల అభివృద్ధికి ఆమోదం

2023 నాటికి నియోజకవర్గానికో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ 

ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రవీంద్రనాథ్‌

బోర్డు డైరెక్టర్లుగా 11 మంది ప్రమాణ స్వీకారం

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లను బలోపేతం చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా 26 ఉత్పత్తులను గుర్తించి అన్ని సౌకర్యాలు ఒకేచోట లభించే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

విజయవాడలోని గవర్నమెంట్‌ ప్రెస్‌ ఆవరణలో ఉన్న ఎంఎస్‌ఎంఈ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ సమావేశం నిర్వహించారు. అంతకు ముందు డైరెక్టర్లుగా నియమితులైన ఎన్‌.రఘునాథ్‌ రెడ్డి, ఎస్‌.ఆనందపార్థసారథి, నల్ల బేబీజానకి, భీమవరపు విజయలక్ష్మి, తలారి అంజనీ, గోపర్తి వరలక్ష్మి, కస్గిరెడ్డి శారద, షేక్‌ కరీముల్లా, మేడా వెంకటబద్రీనారాయణ, శీలమే నదియా, ముదడ్ల గౌరీశంకర్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ జగయ్య పేటలో ఆభరణాల క్లస్టర్, కాకినాడలో ప్రింటింగ్, తూర్పుగోదావరి జిల్లా మాచవరంలో పప్పుదిను సులు, రాజమండ్రిలో ఫర్నిచర్, నెల్లూరులో రెడీ మేడ్‌ దుస్తుల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. 2023 నాటికి అన్ని అసెంబ్లీ నియోజ కవర్గాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేషన్‌ సీఈవో ఆర్‌.పవనమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణ పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top