ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరపాల్సిందే

CV Mohan Reddy Requests To Justice Rakesh Kumar Enquiry On AP Government Petition - Sakshi

ముందే నిర్ణయానికి వచ్చేసి, కేసును విచారించడం సమర్థనీయం కాదు

ఈ పిటిషన్‌ చాలా తీవ్రమైనది

విచారణ నుంచి మీరు తప్పుకోవాలని గౌరవప్రదంగా కోరుతున్నాం

ధర్మాసనానికి సీనియర్‌ న్యాయవాదులు సీవీ మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి వినతి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై జరుగుతున్న విచారణ నుంచి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను తప్పుకోవాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామని దానిపై ముందు విచారణ జరపాల్సిన అవసరముందని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ తీవ్రమైనదని, దానిపై విచారణ జరపకుండా, అలా పక్కన పడేయడానికి వీల్లేదని ప్రభుత్వం తరఫున మరో సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు.

విచారణ నుంచి తప్పుకోవాలని తాము చాలా గౌరవప్రదంగా కోరుతున్నామని, ఆ దిశగానే వాదనలు వినిపిస్తామన్నారు. మొదట ప్రభుత్వ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించిన, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ ఆ తరువాత అందుకు సమ్మతించి శుక్రవారం విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు.. పోలీసులపై దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు గురువారం విచారణకు వచ్చాయి.  చదవండి: (చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి)

ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ, జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ను విచారణ నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిందని.. అది విచారణకు రాలేదని, అందువల్ల తమ అనుబంధ పిటిషన్‌తో పాటు అన్నీ వ్యాజ్యాలను శుక్రవారం విచారించాలని అభ్యర్థించారు. కానీ, దీనిని తోసిపుచ్చిన జస్టిస్‌ రాకేశ్‌కుమార్, రాజ్యాంగం వైఫల్యం అంశంపై విచారణ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వాదనలు వినిపిస్తే వినిపించాలని, లేకపోతే విచారణను ముగిస్తానన్నారు. ఈ సమయంలో సీవీ మోహన్‌రెడ్డి స్పందిస్తూ, ముందుస్తుగానే ఓ నిర్ణయానికి వచ్చేసి, ఈ కేసును విచారించడం సమర్థనీయం కాదని తెలిపారు. ఈ సమయంలో జస్టిస్‌ రాకేశ్‌ జోక్యం చేసుకుంటూ, నేను అలాంటి పిటిషన్‌ను విచారించబోనని తెలిపారు. 

ఈ పిటిషన్‌ వేయకూడదనే అనుకున్నాం
ప్రభుత్వం ఈ పిటిషన్‌ను దాఖలు చేయకూడదనే అనుకున్నదని, ఆయితే మీరు (జస్టిస్‌ రాకేశ్‌) పిటిషన్‌ దాఖలు చేసే పరిస్థితులు కల్పించారని మోహన్‌రెడ్డి చెప్పారు. సుమన్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ రీకాల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తమకు అందజేయాలని ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు తమకు అందలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఉచితంగా కాపీ ఇవ్వరని జస్టిస్‌ రాకేశ్‌ వ్యాఖ్యానించగా, తాము డబ్బు కట్టే దరఖాస్తు చేసుకున్నామని సుమన్‌ సమాధానమిచ్చారు. కాపీ రాకుంటే తామెలా సుప్రీంకోర్టుకు వెళ్లగలమన్నారు. మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. కేసు ఫైళ్లను ఛాంబర్‌లో పెట్టుకుని, వాటిని రిజిస్ట్రీకి పంపకుంటే, తాము ఎప్పటికీ ఉత్తర్వుల కాపీని అందుకోలేమని చెప్పారు. న్యాయమూర్తి ఇందుకు సంబంధించిన అన్ని వ్యాజ్యాలను శుక్రవారానికి వాయిదా వేశారు.

నో చెప్పడానికి వీల్లేదు..
ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ రికార్డులను తెప్పించాలని.. మోహన్‌రెడ్డి కోరారు. కోర్టు ప్రతీ దానికీ, ప్రతీ దాన్ని నో చెప్పడానికి వీల్లేదన్నారు. ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ తమ ముందులేదని రాకేశ్‌ చెప్పగా, దానిని తెప్పించుకోవాలనడంతో మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రభుత్వ పిటిషన్‌ను పరిశీలిస్తామని జస్టిస్‌ రాకేశ్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top