సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరులో సాక్షి టీవీ రిపోర్టర్ నల్లి శ్రీనివాసరావుపై గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు దాడికి తెగబడటం తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు, అదీ సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి మరో రిపోర్టర్‌తో కలిసి బైక్‌పై వస్తున్న శ్రీనివాసరావును ముగ్గురు దుండగులు బైక్‌పై వెంబడించి, పోలీస్ స్టేషన్ సమీపంలో అడ్డగించి విచక్షణారహితంగా దాడి చేశారు.
నిందితులు పిడిగుద్దులతో విరుచుకుపడటంతో శ్రీనివాస్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగి అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించగా, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్ ముందే దాడి జరగడంపై విలేకరుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సాలూరులో దాడికి గురైన శ్రీనివాసరావును మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పరామర్శించారు. సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఆయన, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ప్రశాంతమైన సాలూరులో ఇలాంటి దారుణ ఘటన జరగడాన్ని రాజన్నదొర తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జర్నలిస్టులపై దాడులు జరగడం దురదృష్టకరమన్న ఆయన, శ్రీనివాసరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


