మన విత్తనం దేశంలోనే ఉత్తమం

AP seed is the best in the country - Sakshi

మంచి విత్తనం తయారు చేస్తే ప్రోత్సాహం

బాపట్ల, మార్టేరు వరి వంగడాలకు విస్తృత ప్రచారం

మన వంగడాలను మనమే తయారు చేసుకోవాలి

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ నిర్ణయం

సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ ఏ విష్ణువర్ధన్‌ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్‌ డీన్స్‌ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు
► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. 
► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్‌కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్‌కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. 

విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి
► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. 
► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్‌ చాన్సలర్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి చెప్పారు. 

లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు
► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. 
► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. 
► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top