పాలకుల నిర్లక్ష్యం.. దళారులదే రాజ్యం | All India Kisan Sabha Ashok Dhawale Warning to Chandrababu on Amaravati Outer Ring Road Project | Sakshi
Sakshi News home page

పాలకుల నిర్లక్ష్యం.. దళారులదే రాజ్యం

Apr 27 2026 5:09 AM | Updated on Apr 27 2026 5:09 AM

All India Kisan Sabha Ashok Dhawale Warning to Chandrababu on Amaravati Outer Ring Road Project

మాట్లాడుతున్న ఆలిండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ థావలే

పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలం 

ఆలిండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ థావలే 

ఉయ్యూరు/కంకిపాడు/తెనాలి: పాలకుల తప్పుడు విధానాలతో రైతులు, కౌలురైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆలిండియా కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ థావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతు సంఘం నాలుగో రాష్ట్ర మహాసభల సందర్భంగా  కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెండో రోజైన ఆదివారం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. అశోక్‌ థావలే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత ఆర్థిక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు.

దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయలేకపోవడంతో పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వాలు కార్పొరేట్‌ రంగాలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులు, కౌలురైతులు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బలవంతపు భూ సేకరణను అడ్డుకుంటాం
రాజధాని పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణానికి అవసరానికి మించి ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకుంటామని ఆలిండియా కిసాన్‌ మహాసభ అధ్యక్షుడు డాక్టర్‌ అశోక్‌ థావలే స్పష్టం చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో భూములు కోల్పోతున్న రైతుల అవగాహన సదస్సు ఆదివారం రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలం గుడివాడలో నిర్వహించారు. తొలుత భూ సేకరణకు మార్కింగ్‌ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు.

అశోక్‌ థావలే మాట్లాడుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదనలో కేవలం 70 మీటర్ల వెడల్పు అవసరమని చూపిన ప్రభుత్వం, భూసేకరణకు వచ్చేసరికి 250 మీటర్ల వెడల్పుకు మార్కింగ్‌ చేసినట్లు చెప్పారు. ఈ పరిణామాలతో పూర్తిగా రైతులు నష్టపోతారన్నారు. ప్రభుత్వంపై రైతులంతా సమష్టిగా పోరాడితే  ఆలిండియా కిసాన్‌ మహాసభతో పాటు రైతు సంఘం అండగా నిలుస్తుందని వెల్లడించారు. సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకరరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె.అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement