తెలంగాణకు వారంలో కరువు నిధులను విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ వెల్లడించారు.
కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు వారంలో కరువు నిధులను విడుదల చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ నిధులే ఇస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం కరువు సహాయంపై రాధామోహన్‌సింగ్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం దత్తాత్రేయతో కలసి సింగ్ విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణలో కేంద్ర బృందాలు పర్యటించాయి. ఆ సమయంలో టీ సర్కార్ కరువు నష్టం అంచనా రూ.2,500 కోట్లుగా పేర్కొంది. తర్వాత రూ.3 వేల కోట్లని లేఖ పంపింది. దీనిపై అధ్యయనం జరుగుతోంది. నివేదికను ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోంమంత్రి కార్యాలయానికి అందజేస్తాం. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి వారంలో తెలంగాణకు నిధులు కేటాయిస్తాం’ అని చెప్పారు.
ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ
తెలంగాణలో కరువు నివారణకు కేంద్రం ఎలాంటి సహాయం చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని దత్తాత్రేయ అన్నారు. త్వరగా కరువు నిధులు విడుదల చేయాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను ఫోనులో కోరగా ఆయన అందుకు హామీ ఇచ్చారన్నారు. కాగా తెలంగాణకు వెంటనే కరువు సాయం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. గురువారం ఉదయం ఆయన రాధామోహన్‌సింగ్‌ను కలిసి కరువుసాయం కోరనున్నారు.