అపరిచితులను ఆదుకునే దేశాలివే! | kindest countries to strangers | Sakshi
Sakshi News home page

అపరిచితులను ఆదుకునే దేశాలివే!

Dec 13 2016 3:14 PM | Updated on Sep 4 2017 10:38 PM

అపరిచితులను ఆదుకునే దేశాలివే!

అపరిచితులను ఆదుకునే దేశాలివే!

ప్రపంచంలో ఏ దేశస్థులు అపరిచితులను ఆదరిస్తారు, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు?

న్యూయార్క్‌: ప్రపంచంలో ఏ దేశస్థులు అపరిచితులను ఆదరిస్తారు, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు? అన్న అంశంపై ‘సీఏఎఫ్‌ వరల్డ్‌ గివింగ్‌ ఇండెక్స్‌’ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అభివద్ధి చెందిన దేశాలో, పేద దేశాలో లేదా మతవిశ్వాసం ఎక్కువగానున్న దేశాలో ఆపదలో ఉన్న ఆపరిచితులను ఆదుకుంటాయని మనం భావిస్తాం. కానీ ఎప్పుడూ యుద్ధాలు లేదా అంతర్యుద్ధాలతో, అస్థిర పరిస్థితులతో సతమతమవుతున్న దేశాల ప్రజలే అపరిచితులను ఎక్కువగా ఆదుకుంటారని సర్వేలో తేలింది.


యుద్ధాలు, టెర్రరిస్టుల దాడులతో రక్తమోడుతున్న ఇరాక్‌ , లిబియా దేశస్థులే అపరిచితులను ఎక్కువగా ఆదుకుంటున్నారు. ఇలా గత నెల రోజుల్లో ఒక్కరినైనా ఆదుకున్నవారు ఇరాక్‌లో 81 శాతం మంది ఉండగా, లిబియాలో 79 శాతం మంది ఉన్నారు. 78 శాతంతో కువైట్, 77 శాతంతో సోమాలియా, 75 శాతంతో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, 74 శాతంతో మాలవి, 73 శాతంతో బోట్స్‌వాన, సియెర్రా లియోన్, అమెరికా, సౌదీ అరేబియాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అత్యంత పేద దేశమైన సోమాలియా ప్రజలు కూడా అపరిచితులను ఆదుకోవడంలో ముందుండడం విశేషం.


అస్థిర పరిస్థితుల్లో బతుకుతున్న వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఆ ఒత్తిడి నుంచి బయటపడడంలో భాగంగా వారిలో పరస్పర సహకార గుణం పెరుగుతుందని, తద్వారా వారి మధ్య సామాజిక బంధం బలపడుతుందని ఇదివరకు నిర్వహించిన సర్వేల్లోనే తేలింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సామాజిక కోణం ఉంటుందని సర్వే అధ్యయనకారులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement