
యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా కొనసాగేందుకు విష్వక్సేనుడికి ఆరాధన చేసి స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టు వస్త్రాలను ధరింపచేసి ప్రత్యేక సేవలో అధిష్టింపజేశారు.
ఎదరుగా ప్రత్యేక పీఠంపై ప్రధాన కలశం ఏర్పాటు చేసి అందులో శుద్ధ గంగాజలం పోసి పూజలు చేశారు. గర్భాలయం, ఆలయ పరిసరాలను శుద్ధ జలంతో సంప్రోక్షణ చేశారు. స్వామి, అమ్మవార్ల బంగారు కవచాలకు, స్వయంభూ మూర్తులకు కంకణధారణ చేశారు. రాత్రి మృత్సంగ్రహణం (పుట్టమన్ను తేవడం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో దేవస్థా«నం ఈఓ గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి, కలెక్టర్ అనితారామచంద్రన్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.