తవ్వలేక... తోడలేక!

Srisailam Project Left  Canal Soil Mafia - Sakshi

రూ.80 కోట్లు ఇస్తేనే..ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కదలిక 

ఏడాదిగా ఆగిన సొరంగం పనులు

సాక్షి, హైదరాబాద్‌: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)లో సొరంగా ల తవ్వకాల పరిస్థితి. ఎప్పుడూ ఏదో అవాంతరాల తో ఆగుతున్న ఈ పనులకు ప్రస్తుతం సీపేజీ, పాడైన బోరింగ్‌ యంత్రానికి తోడు నిధుల సమస్య వచ్చి పడింది. గతేడాది మే నెల నుంచి ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు కొత్తగా సీపేజీ సమస్యతో భారీగా నీరు చేరుతూ మొత్తానికి ఎసరు వచ్చేలా ఉంది. తిరిగి పనులను గాడిలో పెట్టేందుకు రూ.80 కోట్ల వరకు చెల్లిస్తే కానీ పనులు సాగవని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి తేల్చిచెప్పడంతో ఆ నిధులు సర్దడం ఎలా అన్నదానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది.
 
ఇప్పుడైనా స్పందిస్తారా..?
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టులో భాగంగా తవ్వాల్సిన రెండు సొరంగాలకు గాను మొదటి దాన్ని శ్రీశైలం డ్యామ్‌ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, ఇప్పటి వరకు 33.20 కి.మీల పని పూర్తయింది. మరో 10.73కి.మీ.ల పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి జరుగుతున్న పనులు గత ఏడాది మే నెల నుంచి ఆగాయి. టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ పాడవడం, కన్వేయర్‌ బెల్ట్‌ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇన్‌లెట్‌ టన్నెల్‌ పనుల వద్ద ప్రస్తుతం ఊహించని విధంగా సీపేజీ వస్తోంది. గరిష్టంగా గంటకు 9వేల లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తుండగా, అంత నీటిని తోడే సామర్ధ్యం పనులు చేస్తున్న జేపీ సంస్థ వద్ద లేకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది.

ఈ దృష్ట్యానే యంత్రం మరమ్మతులకు తోడు నీటిని తోడేందుకు తమకు కనిష్టంగా రూ.60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వా లని ఏజెన్సీ ప్రభుత్వానికి గత ఏడాది నవంబర్‌ నెల లో కోరింది. ఎన్నికల నేపథ్యంలో అది ఆగి చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. దీనిపై ఆశాఖ రూ.60 కోట్ల అడ్వాన్సులు కోరుతూ ఆర్థిక శాఖకు పంపినా ఇంతవరకు నిర్ణయం తీసు కోలేదు. నిధులు విడుదల చేయలేదు.దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ రూ.60 కోట్లకు తోడు ప్రస్తుతం మరో రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.80 కోట్లు చెల్లిస్తే కానీ పనులు మొదలయ్యే అవకాశం లేదని ఇటీవల మరోమారు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అయినా నిధుల విడుదల జరిగి పనులు మొదలవుతాయో లేదో చూడాలి. అయితే ప్రాజెక్టును రూ.1,925 కోట్లతో ఆరంభించగా, తర్వా త ఈ వ్యయాన్ని రూ.3,074 కోట్లకు సవరించారు.ఇందులో రూ.2,186 కోట్ల మేర నిధులు ఖర్చయ్యా యి. ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరో ఏడాది అదనపు సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలే అంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top