చైతన్య రథసారథి.. ఇక్కడి ప్రజలకు పెన్నిధి

Nandamuri Harikrishna In Nalgonda - Sakshi

ఉమ్మడి నల్లగొండ జిల్లాతో నందమూరి హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం

అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ పొలిటబ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణకు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో అనుబంధముంది. మంత్రి హోదాలో ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్‌ – విజయవాడ రహదారిపై ప్రయాణించే క్రమంలో సూర్యాపేట, కోదాడలో ఉన్న తమ స్నేహితులు, సన్నిహితుల ఇంటికి వచ్చి భోజనం చేసేవారు. హరికృష్ణ అకాలమరణ వార్త తెలుసుకుని స్నేహితులు, అభిమానులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు.

కోదాడఅర్బన్‌ : కోదాడతో హరికృష్ణకు ప్రత్యేక అనుబంధముంది. స్థానిక నాయకులతో సన్నిహి త సంబంధాలున్న హరికృష్ణ హైదరాబాద్‌ – విజయవాడల మధ్య ప్రయాణించే సమయంలో తరచూ ఇక్కడ ఆగేవారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, మాజీ డీసీసీబీ చైర్మన్‌ ముత్తవరపు పాండురంగారావులతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నాయకులతో ఆయనకు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. 2008లో అప్పటి టీడీపీ నాయకుడు మధిర బ్రహ్మారెడ్డి ఎన్టీఆర్‌ ఆరోగ్య రథాల పేరిట ఏర్పాటు చేసిన మొబైల్‌ మెడికల్‌ వ్యాన్‌లను ఆయనే నడిపి ప్రారంభించారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు నివాసానికి భోజనానికి వచ్చిన ఆయనను ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న కౌన్సిలర్‌ పార సీతయ్యతో పాటు పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం 2016లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళుతూ ముత్తవరపు పాం డురంగారావు ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వచ్చారు.

ఆ సమయంలో గంటకు పైగా ఇక్కడ గడిపిన హరికృష్ణ అక్కడ వచ్చిన నాయకులను పేరుపేరున పలకరిస్తూ ఫొటోలు దిగారు. 2014లో ఆయన కుమారుడు నందమూరి జానకిరామ్‌ ఆకుపాముల వద్ద ప్రమాదంలో మరణిం చిన సమయంలో స్థానికంగా ఉన్న పలువురు నా యకులు హైదరాబాద్‌కు వెళ్లి ఆయనను పరామర్శించి, సానుభూతి తెలిపారు. తమతో సన్నిహితంగా ఉండి ఆప్యాయంగా పలకరించే హరికృష్ణ మరణం తమను దిగ్బ్రాంతికి గురిచేసిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.పలుమార్లు సూర్యాపేటకు..సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేటతో నందమూరి హరికృష్ణకు ఎంతో అనుబంధం ఉంది.

సూర్యాపేట పట్టణానికి చెందిన సినీ నిర్మాత, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొల్లి వెంకటేశ్వర్‌రావు(కేవీ) ఇంటికి పలుమార్లు వచ్చాడు. ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే సమయంలో కొల్లి వెంకటేశ్వర్‌రావు ఇంటికి వచ్చి కొద్దిసేపు ఆగి, భోజనం చేసి వెళ్లేవారు. వారి ఇంట్లోనే కాసేపు విశ్రాంతి తీసుకునేవారు. కానీ కొల్లి వెంకటేశ్వర్‌రావు చని పోవడంతో అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులకు అప్పుడప్పుడు ఫోన్‌ చేసి యోగక్షేమాలు తెలుసుకునేవారు.

వచ్చే ముందు ఫోన్‌ చేసేవారు ..కొల్లి సంధ్యారాణి, కేవీ సతీమణి

హరికృష్ణ చనిపోయాడని తెలిసి దిగ్బ్రాంతికి గురయ్యా. మా వారితో హరికృష్ణకు మంచి స్నే హం ఉండేది. మా వారు ఉండగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేటప్పుడు మా ఇంటికి వచ్చేవారు. వచ్చే ముందు ఫోన్‌ చేసి ఇంటికి వస్తున్నా.. భోజనం చేసి వెళ్తా.. అని ముందే చెప్పి వచ్చేవారు. ఐదారు సార్లు మా ఇంటికి వ చ్చారు. చాలా సేపు ఉండి భోజనం చేసి మాట్లాడేవారు. బాలకృష్ణ కూడా మా ఇంటికి వస్తుం టారు. హరికృష్ణ అకాల మరణాన్ని జీర్ణించు కోలేకపోతున్నాం.

వలిగొండలో బస్టాండ్‌ ప్రారంభం

వలిగొండ(భువనగిరి) : వలిగొండలోని సా యినగర్‌ సమీపంలో భువనగిరి– నల్లగొండ ప్రధాన రహదారిపై నిర్మించిన బస్టాండ్‌ను 1996లో రవాణాశాఖ మంత్రి హోదాలో ఉన్నప్పుడు నందమూరి హరికృష్ణ ప్రారంభించారు. అంతకుముందు 1983లో హరి కృష్ణ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ చేపట్టిన చైతన్య రథంపై డ్రైవర్‌గా వచ్చారు. ఆయన మరణవార్త తెలుసుకున్న మండల ప్రజలు జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

పార్టీ స్థాపన ప్రకటన మిర్యాలగూడ సభలోనే

మిర్యాలగూడ : హరికృష్ణకు మిర్యాలగూడతో ప్రత్యేక అనుబంధం ఉంది. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించిన సమయంలో తెలంగాణలోనే మొట్టమొదటగా 1983లో నాగార్జునసాగర్‌ (చలకుర్తి) నియోజకవర్గంలో చైతన్యయాత్ర నిర్వహించారు. ఆ సమయంలో చలకుర్తి నుంచి మిర్యాలగూడ వరకు నిర్వహించిన చైతన్య రథయాత్రకు రథసారథిగా ఉన్నారు. మిర్యాగూడలో యాత్ర ముగిసిన సమయంలో ఎన్‌టీఆర్‌తో పాటు హరికృష్ణ కూడా స్థాని కంగా మాజీ జెడ్పీ చైర్మన్‌ సీడీ రవికుమార్‌ నివాసంలో నిద్రించారు. అదేవిధంగా ఎన్ని కల సమయంలో అనేక పర్యాయాలు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మిర్యాలగూడలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట 1999 జనవరి 8వ తేదీన ఎన్‌టీ రామారావు విగ్రహాన్ని హరికృష్ణ ఆవిష్కరించారు. ఆ సమయంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ సభలోనే తాను పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. అదేవిధంగా చివరి సారిగా 2017 మే 14వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం వాడపల్లి శ్రీఅగస్తేశ్వరస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిర్యాలగూడకు చెందిన టీడీపీ నాయకులు  యూసుఫ్, సాధినేని శ్రీనివాసరావు, బంటు వెంకటేశ్వర్లు కూడా అనుబంధం కలిగి ఉన్నారు. 

ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో.. 

హరికృష్ణతో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్ల మోతు భాస్కర్‌రావుకు హరికృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ స్థాపించిన సమయంలో కుందూరు జానారెడ్డితో పాటుగా ఉన్న భాస్కర్‌రావుకు కూడా హరికృష్ణతో సంబంధం ఉండేది.

చౌటుప్పల్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. 

చౌటుప్పల్‌(మునుగోడు) : నందమూరి హరికృష్ణ పలు సందర్భాల్లో చౌటుప్పల్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందమూరి తారకరామారావు చేపట్టిన చైతన్య యాత్ర బస్సుకు డ్రైవర్‌గా చౌటుప్పల్‌కు వచ్చారు. 1995లో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించేందుకు అప్ప టి హోంశాఖా మంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డితో కలిసి వచ్చారు. 1996లో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అదనపు ప్లాట్‌ఫాం నిర్మాణాలను ప్రారంభించేందుకు హాజరయ్యారు. అనంతరం అన్న తెలుగుదేశం పార్టీ జెండావిష్కరణకు మరోసారి చౌటుప్పల్‌కు వచ్చారు.

మూడుసార్లు అడ్లూరు సరస్వతీ ఆలయానికి రాక

శాలిగౌరారం(తుంగతుర్తి) : నందమూరి హరికృష్ణతో శాలి గౌరారం మండలానికి ప్రత్యేక అనుబంధం ఉంది.  అడ్లూరు గ్రామంలో గల ప్రసిద్ధ వీణగాన నృత్య సరస్వతీ ఆలయంతో ఆయనకు విడదీయని బంధం ఏర్పడింది. 1995, 1996, 1999 సంవత్సరాల్లో అడ్లూరులోని సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. తన మనుమరాలికి ఈ దేవాలయంలోనే అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించినప్పుడల్లా ఆలయ పూజారి పానుగంటి మదనాచారితో ప్రత్యేకంగా సుమాలోచనలు జరిపేవారు. హరి కృష్ణ మరణవార్త తెలుసుకుని ఆలయ వంశపారంపర్య పూజా రి పానుగంటి అశోకాచారి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆయనతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.పానగల్‌ ఛాయా సోమేశ్వరాలయంలో పూజలునల్లగొండ కల్చరల్‌ : నందమూరి హరికృష్ణ 2015, 2017 సంవత్సరాల్లో పానగల్లులోని ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. మొదటిసారి 2015 డిసెంబర్‌ 2న, రెండోసారి 2017 మార్చి 11 ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

బుధవారం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గంట్ల అనంతరెడ్డి మాట్లాడుతూ ఛాయా సోమేశ్వరాలయంపై హరికృష్ణకు మంచి అభిప్రాయం ఏర్పడిందని, మళ్లీ ఆలయానికి వస్తానన్నారని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారని పేర్కొన్నారు.

పోచంపల్లిలో భావోద్వేగంతో ప్రసంగం

భూదాన్‌పోచంపల్లి(భువగనగిరి) : నందమూరి హరికృష్ణకు పోచంపల్లితో అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు మరణాంతరం ‘అన్న తెలుగుదేశం పార్టీ’ని స్థాపించి, ఎన్నికల ప్రచారంలో భా గంగా 1998 ఆగస్టు నెలలో పోచంపల్లికి వచ్చా రు. కర్నాటి పాండు ఇం టి పైన ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నేతాజీ చౌరస్తాలో నాడు దివంగత ఎన్టీ రా మారావు చైతన్యరథ యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి స్థానిక ప్రజలనుద్దేశించి మాట్లాడి వారి మన్ననలు చూరగొన్నారు.

మండల ప్రజలు చూపించిన అభిమానాన్ని ఎన్నడూ మరువలేనని భావోద్వేగంతో  ప్రసం గించారు. ఆ రోజు పోచంపల్లిలో 2 గంటలపాటు గడిపాడు. అప్పటి అన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్న బొంగు శంకరయ్యతో పాటు గునిగంటి మల్లేశ్‌గౌడ్, బండి యాదగిరి, బైరు రామాంజనేయులు, బోగ రఘు తదితరులు నందమూరి హరికృష్ణను శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. హరికృష్ణ అకాల మృతిపై బుధవారం పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.     

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top