
విద్యార్థులకు అందించే భోజనాన్ని రుచి చూస్తున్న మంత్రులు జోగురామన్న, ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ, ఇంటర్మీడియెట్, ఇతర వృత్తివిద్యా కాలేజీలకు చెందిన సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అమలు చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. విద్యార్థులకు పోషక విలువలుగల భోజనం అందించేందుకు కావాల్సిన మెనూ, వాటి ధరల నివేదికను ఈ నెల 6న ప్రభుత్వానికి సమర్పించాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు సూచించింది. నివేదికను సీఎం కేసీఆర్‌కు సమర్పించాక పథకం అమలుపై ఆయన నిర్ణయం ప్రకటిస్తారని కమిటీ తెలిపింది.
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలతో కూడిన కమిటీ శుక్రవారం సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు అవసరమైన వసతులను సమకూర్చుకోవాలని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కమిటీ సూచించింది.
ఈ సూచనకు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు అంగీకరించారు. వీలైనంత త్వరలో వంటగదులు ఏర్పాటు చేస్తామని, 2, 3 రోజుల్లో తమ నివేదికను అందిస్తామన్నారు. కాలేజీల విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతను తెలుసుకునేందుకు మంత్రులు ఈ సందర్భంగా వంటకాలను రుచి చూశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, మోడల్ జూనియర్ కాలేజీల డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.