
ఏపీలో ఈ నెల 12నే ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఫలితాల విడుదలపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఫలితాల విడుదలలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 18న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ సోమవారం వెల్లడించారు. ఏపీలో ఈ నెల 12నే ఇంటర్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఫలితాల విడుదలపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యా సంవత్స రం ప్రారంభంలో ప్రవేశాలు, ఫలితాల ప్రాసెస్, కంప్యూటర్ ఏజెన్సీ ఖరారు అంశాల్లో బోర్డు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
దీంతో ఫలితాల ప్రాసెస్ పర్యవేక్షణ బాధ్యతలను జేఎన్‌టీయూ ఉన్నతాధికారికి బోర్డు అప్పగించింది. ఆ సమస్యల ప్రభావం ఫలితాల విడుదలపైనా పడింది. తెలంగాణ, ఏపీలో ఇంటర్ పరీక్షలు ఒకేసారి జరి గిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణలోనూ ఫలితాలు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు సోమవారం బోర్డు వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలకు తెరదించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది.