ఆగని.. లొల్లి!

Disagreement in TRS Party  Leaders Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్‌లో అసమ్మతి మంటలు ఇంకా చల్లారడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ప్రకటించిన టికెట్లపై లొల్లి షురూ అయ్యింది. గులాబీ టికెట్లు దక్కించుకున్న వారి అభ్యర్థిత్వాలను రద్దు చేయాలని, అభ్యర్థులను మార్చాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో కోదాడ, హుజూర్‌నగర్‌ మినహా పది చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో ఆరు చోట్ల అసమ్మతి తలనొప్పి మొదలైంది. రోజుకో చోట అసమ్మతి నాయకుల భేటీలు, ఆ తర్వాత ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. దీనికి విరుగుడుగా పార్టీ సీనియర్లందరినీ ఒకచోటకు చేర్చే పనిలో అధినాయకత్వం పడింది. దీనికి పార్టీలో ముందు నుంచీ ఉన్న సీనియర్లకే బాధ్యత అప్పజెప్పింది. దీంతో అసమ్మతి నాయకుల సమావేశాలను హైకమాండ్‌ సీరియస్‌గానే తీసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసమ్మతికి కౌంటర్‌గా నిర్వహించస్తున్న ఆత్మీయ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.

చల్లారని అసంతృప్తి మంటలు..
మునుగోడులో అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్న అసంతృప్త నేతలు ఈ నెల 21వ తేదీన చండూరులో బహిరంగ సభను నిర్వహించను న్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన వేనేపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సభ జరగనుంది. ఆయన ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే చండూరులో సభ జరపాలని నిర్ణయించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి జన సమీకరణ జరిపి భారీస్థాయిలో నిర్వహించేలా అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థిపై నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత ఉందో ఈ సభ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నామని అసమ్మతి నేతలు చెబుతున్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ నియోజకవర్గం అసమ్మతి సభ జరగనుంది.

పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిని మార్చకుంటే కాంగ్రెస్‌ సునాయాసంగా గెలుస్తుందని, పార్టీ నేతలంతా ఒక్కటిగా కలిసి పనిచేయాలంటే సీనియర్లను పరిగణనలోకి తీసుకుని టికెట్‌ మార్చాలని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి నేతృత్వంలో నార్కట్‌పల్లిలో ఇప్పటికే సన్నాహక సమావేశం జరిగింది. మరో నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌ శుక్రవారం తిప్పర్తి మండలంలో సొంతంగా ప్రచారం కూడా చేశారు. సోమవారం జరగనున్న అసమ్మతి సభపై పార్టీ పెద్దలు దృష్టిపెట్టి సమాచారం సేకరిస్తున్నారు. నాగార్జునసాగర్‌లో అక్కడి అభ్యర్థి నోముల నర్సింహయ్యను మార్చి స్థానికులకే టికెట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ నుంచి అక్కడి అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న స్థానిక నాయకులను పక్కన పెట్టి స్థానికేతరులను తమ నెత్తిన రుద్దవద్దని వీరు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ పార్టీ నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్యర్యంలో పార్టీ శ్రేణులు టికెట్‌ మార్పుపై గట్టిగా కొట్లాడుతున్నాయి. పార్టీ అగ్ర నాయకత్వం తమకు సానుకూల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం వీరిలో వ్యక్తం అవుతోంది.

అసమ్మతికి కౌంటర్‌గా ఆత్మీయ సమావేశం!
పార్టీ నాయకత్వం తెరవెనుక ఉండి అసమ్మతి నేతలకు చెక్‌పెట్టే వ్యూహాలను రచిస్తోంది. ప్రధానంగా నల్లగొండ నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ఉండడం, ఏడాది కిందట పార్టీలో చేరిన టీడీపీ నేత కంచర్ల భూపాల్‌రెడ్డితో వీరికి పొసగక పోవడంతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఇందులో పార్టీలో మొదటి నుంచి ఉన్న వారు, మధ్యలో కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరినవారు, కంచర్ల కంటే ముందే టీడీపీ నుంచి వచ్చి గులాబీ గూటికి చేరిన వారున్నారు. తనతో పాటు పార్టీ మారిన వారికే కంచర్ల ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది.

దీంతో అభ్యర్థి గట్టున పడాలంటే, అసమ్మతికి చెక్‌పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించిందని, దానిలో భాగంగానే శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ సీనియర్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేసిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి పేర పార్టీ శ్రేణులకు ఆహ్వానం కూడా వెళ్లింది. వీరి పేరునే ప్రకటన కూడా జారీ అయ్యింది. అసమ్మతి శిబిరంలో ఉన్న వారందరినీ పార్టీ తమవైపు తిప్పుకునేందుకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఇంకా అసమ్మతి మంటలు చల్లారకపోవడం పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురిచేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top