జేబుకు చిల్లే..

Corona Effect: 87 percent people worried about damage to income - Sakshi

కరోనా దెబ్బకు ఆదాయం తగ్గుతుందనే ఆందోళనలో 87 శాతం మంది 

50శాతం కన్నా ఎక్కువ రాబడి తగ్గిపోతుందని చెప్పిన 26% మంది  

31 శాతం మందిలో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అంశాలపై గుబులు 

‘లోకల్‌ సర్కిల్స్‌’ సర్వేలో వెల్లడైన జనం మనోగతం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా.. ఇప్పుడు ప్రపంచ ప్రజలను ఆరోగ్యపరంగా హైరానా పెడుతోన్న పేరిది. ఈ వైరస్‌ ఎక్కడి నుంచి ఎలా వ్యాపిస్తుందో తెలియక, ‘ఐసోలేషన్, క్వారంటైన్‌’లను తలచుకుని అంతా హడలిపోతున్నారు. అందుకే ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు జనం ఇంటికే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. అయితే, ఈ మహమ్మారి ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ జనజీవనాన్ని కకావిలకం చేయనుందనే గుబులు పట్టిపీడిస్తోంది. ఇదే విషయాన్ని వెల్లడించింది లోకల్‌ సర్కిల్స్‌ అనే సంస్థ నిర్వహించిన సర్వే. ఈ సర్వే ప్రకారం 87శాతం మంది ఏదో స్థాయిలో తమ ఆదాయంపై ప్రభావం చూపనుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దేశవ్యాప్తంగా 17వేల మందితో ఈ సర్వే నిర్వహించారు. 45 రోజుల క్రితం నిర్వహించిన ఇదే సర్వేలో 28 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన చెందగా, ఇప్పుడు ఏకంగా 87 శాతం మంది భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నట్టు తేలింది. 

సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలివీ.. 
26 శాతం మంది: తమ ఆదాయం కరోనా కారణంగా 50 శాతం కన్నా ఎక్కువ తగ్గిపోతుందని ఆందోళన వెలిబుచ్చారు.  
25–50 శాతం మంది: తమ ఆదాయం 25–50 శాతం వరకు తగ్గిపోతుందని చెప్పారు. 
12 శాతం మంది: 25 శాతం ఆదాయం తగ్గుతుందని చెప్పారు. 
24 శాతం మంది: ఆదాయం తగ్గుతుంది కానీ, ఏ మేరకు తగ్గుతుందో చెప్పలేమన్నారు. 
11 శాతం మంది: తమ ఆదాయం ఏ మాత్రం తగ్గదనే ధీమా వ్యక్తం చేశారు. 
2 శాతం మంది: ఆదాయం తగ్గకపోగా, పెరుగుతుందని చెప్పారు. 

► సర్వేలో పాల్గొన్న వారిలో 31 శాతం మంది తమ ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక అంశాలపై ఆందోళన వెలిబుచ్చారు. 
► 24 శాతం మంది తమకు కరోనా వైరస్‌ సోకుతుందనే ఆందోళనతో ఉన్నారు. 
► 11 శాతం మంది కుటుంబ అవసరాల కోసం నిత్యావసరాలు దొరకవేమోనని భయపడుతున్నారు. 
► 26 శాతం మంది మీడియాలో కరోనా వైరస్‌ గురించి వస్తున్న నెగెటివ్‌ వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top