హాజీపూర్‌ బాధితులకు భరోసా  

Assure to the Hajipur victims - Sakshi

ఒక్కో కుటుంబానికి రూ.25వేల చెక్కు అందజేసిన రాచకొండ సీపీ

సాక్షి, హైదరాబాద్‌ : యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ను శనివారం కలిశాయి. సైకో శ్రీనివాసరెడ్డి చేతిలో క్రూరంగా హతమైన శ్రావణి, మనీషా కుటుంబసభ్యులు, మైసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కల్పన కుటుంబీకులు నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ మహేశ్‌ భగవత్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారి కుటుంబపరిస్థితులు, జీవనోపాధులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలు ఏం చదువుతున్నార ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మానవతా దృక్పథంతో మనీషా, కల్పన కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.25వేల చెక్కును అందజేశారు.కాగా సీపీ ఏప్రిల్‌ 27న హాజీపూర్‌ గ్రామానికి వెళ్లినప్పుడు శ్రావణి కుటుంబీకులకు రూ.25వేలు అందజేసిన సంగతి తెలిసిందే.ఈ మూడు కుటుంబాల్లో అర్హత కలిగిన వారికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వడంతోపాటు జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేస్తూ ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధిని వచ్చేలా చూస్తానన్నారు. అలాగే మృతిచెందిన ఓ బాలిక తమ్ముడికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని కూడా హమీఇచ్చారు.  

హాజీపూర్‌లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు... 
నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఈ కేసులో శాస్త్రీయ ఆధారాలను సేకరించడంతో పాటు కేసు విచారణ పారదర్శకంగా సాగేందుకు విచారణాధికారిగా భువనగిరి ఏసీపీ భుజంగరావును నియమించామని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హాజీపూర్‌ గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటుచేయడంతో పాటు సీసీటీవీ కెమెరాలను అమర్చేలా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేస్తున్నామని చెప్పారు. హాజీపూర్‌ నుంచి బీబీనగర్, భువనగిరికి వెళ్లేలా మరొక ఆర్‌టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సీపీని బాధిత కుటుంబాలు కోరాయి. ఏదైనా ఘటనా జరిగిన వెంటనే డయల్‌ 100కు ఫోన్‌కాల్, 9490617111 నంబర్‌కు వాట్సాప్‌ చేయడంతో పాటు స్థానిక పోలీసులను సంప్రదించాలన్నారు. మరొకమారు హాజీపూర్‌లో సీపీ పర్యటించి అక్కడి గ్రామస్తుల్లో భరోసాను నింపనున్నారు.     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top