బాబు పాలనపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు

YSRCP Leaders Fires On Chandrababu Government - Sakshi

సాక్షి, కర్నూలు : మహానేత వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద  ‘వైఎస్సార్‌ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రసంగించారు.

జలయఙ్ఞంతో రైతులకు మేలు : ధర్మాన ప్రసాద్‌
దేశానికి వెన్నెముక వంటి రైతు ప్రయోజనాలను రక్షించడానికి దీక్ష పూనింది వైఎస్సారేనని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన మహానేతను స్మరించుకోవడానికి వైఎస్సార్‌ గంగా హారతి ద్వారా అవకాశం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రోజూ రైతులు చనిపోతున్నారని, వారికి మేలు చేయాలని ఆనాడు వైఎస్సార్‌ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ‘వ్యవసాయం దండగ’ అంటూ రైతులను అవమానించిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 70 లక్షల మందికి వైఎస్సార్‌ పెన్షన్‌ సదుపాయం కల్పించారన్నారు. జలయఙ్ఞం చేపట్టి రైతు కష్టాలను తీర్చడం కోసం వైఎస్సార్‌ కృషి చేశారన్నారు. సీఎం అంటే వైఎస్సార్‌లా ఉండాలనే పేరు పొందిన మహనీయ వ్యక్తి వైఎస్సార్‌ అని కొనియాడారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్రప్రయెజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. డబ్బులకు ఆశపడే కొందరు టీడీపీలో చేరారని, వారందరి భరతం పట్టే కార్యక్రమం దగ్గర్లోనే ఉందంటూ ధర్మాన ఫిరాయింపు ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

వైఎస్సార్‌ మేలు ఎవరూ మరువరు : శిల్పా చక్రపాణి రెడ్డి
వైఎస్సార్‌ కృషితోనే సిద్ధాపురం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సాధ్యమైందని శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. రాయలసీమకు మహానేత చేసిన మేలును ఎవరూ మరవరన్నారు. వైఎస్‌ జగన్‌ కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఒ‍క్క ప్రాజెక్టు ప్రారంభించలేదు : నాగిరెడ్డి
అపార పాలనానుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని వైఎస్సార్‌సీపీ నేత నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జలయఙ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టి.. వాటి కోసం నిధులు కేటాయించింది వైఎస్సారేనని గుర్తుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top