గాంధీజీపై ట్వీట్‌కు ఇదేమి శిక్షా ?!

Sarcastic Tweet on Mahatma Gandhi Misinterpreted - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ఆహా,  గాంధీజీ 150వ జయంతి ఎంత అద్భుతంగా జరుగుతోంది. కరెన్సీ నోట్ల పై నుంచి ఆయన చిత్రాలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలను తొలగించేందుకు ఇదే అదను. ఆయన పేరుతో ఉన్న సంస్థలు, రోడ్ల పేర్లను మార్చండీ, అదే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అవుతోంది. థ్యాంక్యూ గాడ్సే ఫర్‌ 30–1–1948’.. మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్‌ అధికారి నిధి చౌధరి మే 17వ తేదీన చేసిన ఈ ట్వీట్‌పై ఎంతో రాద్ధాంతం జరిగిన విషయం తెల్సిందే. కాంగ్రెస్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ఈ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ నాయకుడు జితేంద్ర అవ్హాద్‌ అయితే తక్షణం ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. ఆయన పార్టీ నాయకుడు శరద్‌ పవార్, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఏకంగా లేఖ కూడా రాశారు. ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనిష్‌ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ కాంగ్రెస్‌ సభ్యుడు రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా కూడా ఆమె ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. 

మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సేనే నిజమైన దేశభక్తుడంటూ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే (మే 17న) నిధి చౌధరి గాంధీజీపై ట్వీట్‌ చేయడం గమనార్హం. తనపై ఇంత రాద్ధాంతం జరగుతుండడంతో ఆ ట్వీట్‌ను వెంటనే తొలగించిన నిధి, అవి తాను వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలని ఎన్నో వివరణలు ఇచ్చారు. ఆ ట్వీట్‌కు ‘విలపిస్తోన్న ఎమోజీ’ చిహ్నాన్ని పెట్టాను చూడండంటూ మొత్తుకున్నారు. తాను గాంధీజీని స్మరించుకోనిదే ఏ రోజు ఇంటి నుంచి బయటకు పోనని చెప్పుకున్నారు. 2011 సంవత్సరం నుంచి గాంధీజీ సూక్తులను తాను వరుసగా ట్వీట్‌ చేస్తూ వస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. గాంధీజీ రాసిన పుస్తకాల్లో ‘మై ఎక్స్‌పరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ తనకు  నచ్చిన దాంట్లో ఒకటంటూ గత ఏప్రిల్‌ తాను ట్వీట్‌ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందుకు రుజువుగా పాత ట్వీట్లన్నింటిని ఆమె రీట్వీట్లు చేశారు. 

అయినప్పటికీ సోషల్‌ మీడియాతోపాటు ప్రధాన మీడియా కూడా ఇప్పటికీ ఆమెపై తప్పుడు ప్రచారాన్నే సాగిస్తున్నాయి. ఫలితంగా ఇంతకుముందే ఆమెకు షోకాజ్‌ నోటీసును జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ముంబైలో డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న నిధి చౌధరిని, వాటర్‌ సానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. ఆ ఉత్తర్వులు అందుకునేందుకు ఆమె ప్రస్తుతం అందుబాటులో లేరు. తనపై అనవసర వివాదం చెలరేగడంతో ఆమె సెలవుపై విదేశాలకు వెళ్లారు. 

గాంధీజీ హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌ బీజేపీ తరఫున పోటీచేస్తే నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో పార్లమెంట్‌కు ఎన్నుకున్నాం. ఆమెపైన ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆమె వ్యాఖ్యలకు నొచ్చుకొని వ్యంగోక్తులు చేసినందుకు నిధి చౌధరికి శిక్ష పడింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top