ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం

Coming with a political party says Kodandaram - Sakshi

అందుకే రాజకీయ పార్టీగా వస్తున్నాం: కోదండరాం 

హైదరాబాద్‌: ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించేందుకు రాజకీయంగా ముందుకు వస్తున్నామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. కోదండ రాం నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీలో పనిచేస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌తోపాటు పలువురు అనుచరులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. దిలీప్‌ తన అనుచరులనుకోదండరాం కు పరిచయం చేశారు. కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ప్రత్యామ్నాయ రాజకీయశక్తి అవసరమని భావించామన్నారు.  

వారం తర్వాత కొత్త పార్టీ ప్రకటన 
కొత్త పార్టీ నిర్మాణానికి చర్యలు ప్రారంభించామని, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తవుతుందని, అప్పుడే పార్టీని ప్రకటిస్తామని కోదండరాం అన్నారు. ఇప్పటికే పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. తెలంగాణ వస్తే మార్పు జరుగుతుందని, పిల్లలకు ఉచితంగా చదువులు, వైద్యం అందుతుందని, వ్యవసాయం బాగుపడుతుందని భావించామని, కాని ఆ పరిస్థితులు కానరావడంలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెక్రటేరియేట్‌కు వెళ్లడం లేదని, కనీసం ఆయన ఇంటి వద్ద ధర్మదర్శనానికి కూడా అవకాశం లేకుండా పోయిందన్నారు.

దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ తాను ఏ పదవిని ఆశించి రాలేదని, ప్రజలు కోరుకున్న తెలంగాణ కోసం కోదండరాంతో కలసి పనిచేయడానికి వచ్చానని తెలిపారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ రియాజ్, మాజీ గౌరవాధ్యక్షురాలు కపిలవాయి ఇందిర,  ఆకుల శ్రీనివాస్, సుబ్రమణ్యం, రవీందర్, విశాల్, మల్లేశ్, పార్థసారథి, జ్యోష్న, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top