
'రాందేవ్ బాబాకి ఝలక్'
యోగా గురువు బాబా రాందేవ్కి లీజు కింద కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నట్లు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
సిమ్లా : యోగా గురువు బాబా రాందేవ్కి లీజు కింద కేటాయించిన భూమిని రద్దు చేస్తున్నట్లు హిమాచల్ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో రెవెన్యూ మంత్రి కౌల్సింగ్ ఠాకూర్ వెల్లడించారు.
బాబా రాందేవ్ ఆధ్వర్యంలో పతంజలి యోగా ట్రస్ట్ సంస్థ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు ఫుడ్ ప్రాసెసింగ్, హెర్బల్ గార్డెన్తోపాటు అయుర్వేద మందులు, వైద్య కర్మాగారం నిర్మాణం కోసం 2010లో అప్పటి హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ దుమాల్.. ఈ సంస్థకు 21 ఎకరాలు కేటాయించారు. అది సోలాన్ జిల్లాలోని సాధుపుల్ వద్ద ఈ 21 ఎకరాలు భూమిని 99 ఏళ్ల పాటు కేవలం రూ.17 లక్షలు చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రేమ కుమార్ దుమాల్ పేర్కొన్నారు.
అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతోపాటు రాందేవ్ బాబాకు అత్యంత అప్తుడు ఆచార్య బాలకృష్ణ సంతకాలు చేశారు. ఈ బాబారాందేవ్కి భూకేటాయింపు ఒప్పందంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంతలో 2012లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు రానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి... ముఖ్యమంత్రిగా వీరభద్ర సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఈ భూకేటాయింపుపై విచారణ జరిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్టేట్ విజిలెన్స్ కమిషన్ను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ భూకేటాయింపులపై సీబీఐ విచారణ జరుపుతారా ? అని గతేడాది జులైలో వీరభద్రసింగ్ను విలేకర్ల ప్రశ్నించగా... సీబీఐ సంస్థ అంతా గుజరాత్కి చెందిన కాషాయం పార్టీకి చెందిన ఉన్నతాధికారులతో నిండిపోయిందని వీరభద్రసింగ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన విజిలెన్స్ సంస్థతోనే విచారణ జరుపుతామని అప్పుడే చెప్పారు. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ భూకేయింపులు రద్దు చేస్తున్నట్లు బుధవారం వీరభద్రసింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.