పతంజలి ఉత్పత్తులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్! | Sakshi
Sakshi News home page

పతంజలి ఉత్పత్తులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్!

Published Tue, May 30 2017 4:22 PM

పతంజలి ఉత్పత్తులు నాణ్యత పరీక్షల్లో ఫెయిల్!

బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి సంస్థ ఉత్పత్తులు సహా దాదాపు 40 శాతం వరకు ఆయుర్వేద ఉత్పత్తులు నాణ్యత పరీక్షలలో విఫలం అయినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసింది. హరిద్వార్‌కు చెందిన ఆయుర్వేద, యునానీ కార్యాలయం ఈ పరీక్షలు చేసింది. 2013 నుంచి 2016 వరకు మొత్తం 82 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా, వాటిలో 32 నాణ్యత పరక్షీలలో విఫలమయ్యాయి. పతంజలి సంస్థ వారి దివ్య ఆమ్లా జ్యూస్, శివలింగి బీజ్ లాంటి ఉత్పత్తులలో కూడా నాణ్యత తగినంతగా లేదని తేలింది.

పశ్చిమబెంగాల్‌లోని పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ వాళ్లు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో కూడా ఆమ్లా జ్యూస్ విఫలం కావడంతో గత నెలలో సైనిక దళాల క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (సీఎస్‌డీ) నుంచి దాన్ని ఉపసంహరించుకున్నారు. నీళ్లలో కరిగే పదార్థాలలో ఉన్న క్షారతను పరీక్షించడానికి చూసే పీహెచ్ విలువ.. ఆమ్లా జ్యూస్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ల్యాబ్ నివేదిక తెలిపింది. 7 కంటే తక్కువ పీహెచ్ విలువ ఉన్న ఉత్పత్తుల వల్ల ఎసిడిటీ, ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శివలింగి బీజ్‌లో 31.68 శాతం వేరే పదార్థాలు ఉన్నాయన్నారు. అయితే ఈ ఆరోపణలను పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ ఖండించారు.శివలింగి బీజం అనేది సహజమైన విత్తనమని, అందులో కల్తీ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. పతంజలి సంస్థ పేరు ప్రతిష్ఠలను మంటగలిపేందుకు ఇలా తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ ఆయుర్వేద ఉత్పత్తుల కేంద్రంగా మారింది. ప్రధానంగా హరిద్వార్, రిషికేశ్‌లలోనే వెయ్యిమందికి పైగా ఆయుర్వేద డీలర్లు, ఉత్పత్తిదారులు, సరఫరా దారులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement