చార్జిషీట్ లేకుండా 3 నెలలకు మించి సస్పెండ్ చేయరాదు: సుప్రీం | not allowed to suspend without charge sheet, says supreme court | Sakshi
Sakshi News home page

చార్జిషీట్ లేకుండా 3 నెలలకు మించి సస్పెండ్ చేయరాదు: సుప్రీం

Feb 18 2015 12:18 AM | Updated on Nov 6 2018 8:51 PM

చార్జిషీట్ లేకుండా 3 నెలలకు మించి సస్పెండ్ చేయరాదు: సుప్రీం - Sakshi

చార్జిషీట్ లేకుండా 3 నెలలకు మించి సస్పెండ్ చేయరాదు: సుప్రీం

ఒక ప్రభుత్వ ఉద్యోగిని.. చార్జిషీటు లేకుండా 90 రోజులకు మించి సస్పెన్షన్‌లో ఉంచరాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది.

 న్యూఢిల్లీ:  ఒక ప్రభుత్వ ఉద్యోగిని.. చార్జిషీటు లేకుండా 90 రోజులకు మించి సస్పెన్షన్‌లో ఉంచరాదని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టంచేసింది. అలా ఉంచినట్లయితే.. సదరు ఉద్యోగి తనపై నేరాభియోగాలు నమోదు కాకముందే సంస్థలో అవమానానికి, సమాజంలో తిరస్కారానికి, తన శాఖలో పరిహాసానికి గురవుతారని పేర్కొంది. అపరాధానికి పాల్పడ్డ ప్రభుత్వ ఉద్యోగిని సుదీర్ఘకాలం సస్పెన్షన్‌లో ఉంచటం ఒక విధానంగా మారిపోయిందంటూ.. ప్రత్యేకించి అభియోగాల రూపకల్పనకు ముందు సస్పెన్షన్ అనేది స్వభావరీత్యా తాత్కాలికమైనదిగా, స్వల్ప వ్యవధితో కూడినదై ఉండాలని జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ఉద్ఘాటించింది.

ఈ సస్పెన్షన్ అనిశ్చిత కాలం కొనసాగినా లేదా బలమైన కారణాలు లిఖితపూర్వకంగా లేకుండా సస్పెన్షన్‌ను పునరుద్ధరించినా.. అది స్వాభావికంగా శిక్షగా మారుతుందని వ్యాఖ్యానించింది. ‘‘సస్పెన్షన్‌కు గురైన వ్యక్తికి.. తన నిర్దోషిత్వాన్ని రుజువుచేసుకుందామన్నా కూడా.. తనపై విచారణ ముగియటానికి అనిశ్చిత సమయం పడుతుందన్న విషయం తెలిసివుండటమే ఒక వేదన. చాలా తరచుగా ఇప్పుడిది పదవీ విరమణ వరకూ కొనసాగుతోంది’’ అని అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారి/ఉద్యోగిపై సస్పెన్షన్ ఉత్తర్వులు మూడు నెలల కాలానికి మించరాదని స్పష్టంచేసింది. ఒకవేళ ఈ కాలపరిదిలో సదరు వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసినట్లయితే.. సస్పెన్షన్‌ను పొడిగించడానికి హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. కశ్మీర్‌లో సుమారు నాలుగు ఎకరాల భూమి వినియోగానికి తప్పుడు నిరభ్యంతర పత్రాలు జారీచేశారన్న ఆరోపణలపై 2011లో సస్పెన్షన్‌కు గురైన డిఫెన్స్ ఎస్టేట్ అధికారి అజయ్‌కుమార్‌చౌదరి వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement