ఆమె అందగత్తే కానీ.. ఫ్యాన్స్‌ చేసిన పనే..

Huge Calls to Hello Movie Mobile Number - Sakshi

గురుగ్రామ్‌ : ’హలో’  సినిమాతో హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శన్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. పడిచచ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్‌ను కూడా సంపాదించుకున్నారు. అవును. ఆ ఫ్యాన్‌ ఫాలోయింగే వికాస్‌ ప్రజాపతి అనే వ్యక్తి పాలిట శరాఘాతంగా మారింది.

’హలో’  చిత్రంలోని ఓ సన్నివేశంలో స్నేహితుడితో విడిపోతున్న చిన్నారి కళ్యాణి ప్రియదర్శన్‌ వంద రూపాయల నోట్‌పై ఫోన్‌ నంబర్‌ను రాసి కారులోంచి కిందకు వదిలేస్తుంది‌. ఆ నంబర్‌ను హీరో అఖిల్‌ సినిమా చివర్లో తీసుకుంటే.. సినిమా చూసిన వాళ్లలో కొందరు యువకులు మాత్రం అప్పటికప్పుడే నోట్‌ చేసుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకే అర్థమై ఉంటుంది.

కళ్యాణితో మాట్లాడాలంటూ ఆ నంబర్‌కు ఫోన్‌ కాల్స్‌ వరుస కట్టాయి. వాస్తవానికి ఆ నంబర్‌ గురుగ్రామ్‌లో నివసిస్తున్న వికాస్‌ ప్రజాపతిది. ఆయన వృత్తి రీత్యా కంప్యూటర్‌ ఆపరేటర్‌. సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి కళ్యాణితో మాట్లాడాలంటూ వేల సంఖ్యలో కాల్స్‌ రావడంతో ఏం జరుగుతుందో వికాస్‌కు అర్థం కాలేదు.

అసలు కళ్యాణి ప్రియదర్శన్‌ ఎవరో తెలుసుకోవడానికి గూగుల్‌ చేయగా ఆమె ఓ హీరోయిన్‌ అని తెలిసి షాక్‌ తిన్నారు. కాల్‌ చేసిన ప్రతి ఒక్కరికీ అది కళ్యాణి నంబర్‌ కాదని చెప్పలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వికాస్‌ వెల్లడించారు. గత ఐదేళ్లుగా తాను ఈ నంబర్‌ను వాడుతున్నట్లు తెలిపారు. ’హలో’  నిర్మాతలపై కేసు వేస్తున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లోనైనా ఫోన్‌ కాల్స్‌ రావడం ఆగుతుందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.

వికాస్ తరఫు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేస్తున్న న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్‌ పర్సనల్‌ లైఫ్‌ను కళ్యాణి ఫ్యాన్స్‌ నాశనం చేశారని అన్నారు. వరుస ఫోన్‌ కాల్స్‌ రావడం వల్ల ఆఫీసులో పని చేయలేక వికాస్‌ తన బాస్‌లతో తిట్లు తినాల్సి వచ్చిందని తెలిపారు. భార్య, బిడ్డలతో మాట్లాడటానికి కూడా గ్యాప్‌ లేకుండా ఫోన్స్‌ వచ్చేవని వెల్లడించారు.

ప్రజాపతి నోటిసులపై స్పందించిన ’హలో’  నిర్మాతలు ఆ నెంబర్‌ను వినియోగించేందుకు టెలికాం కంపెనీ నుంచి పర్మిషన్‌ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, తాము అలాంటి అనుమతి ఇవ్వలేదని సదరు టెలికాం కంపెనీ పేర్కొనడం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top