నేటి డూడుల్‌ ఏంటో తెలుసా? 

Google Doodle tributes Soviet filmmaker Sergei Eisenstein - Sakshi

ప్రఖ్యాత గూగుల్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది పొందిన వ్యక్తులను డూడుల్‌రూపంలో లోగోను తయారుచేసి వారిని గౌరవిస్తుంది. వారి పుట్టిన రోజున వీటిని ఆ ఒక్కరోజు డూడుల్‌గా గూగుల్‌లో దర్శనమిస్తుంది. ఈ రోజు(జనవరి 22)న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సెర్గీ ఐజిన్‌స్టైన్‌పై డూడుల్‌ చిత్రించి గౌరవించింది. నేడు ఆయన 120వ పుట్టిన రోజు. చిత్రరంగంలో ఫిల్మ్‌లతో సినిమాలను చిత్రీకరించడం ఈయనతోనే ప్రారంభమైంది. ఈయనను ఫాదర్‌ ఆఫ్‌ మోంటేజ్‌ టెక్నిక్‌ ఇన్‌ ఫిల్మ్‌మేకింగ్‌ అంటారు. అందుకే ఈయనను ఫిల్మ్‌లతో కూడిన లోగోను ఏర్పాటుచేసి డూడుల్‌గా పెట్టారు. ఫిల్మ్‌లతో కూడిన గూగుల్‌ అనే అక్షరాల నడుమ సెర్గీ  ఈ రోజు మనకు దర్శనమిస్తాడు. మాంటేజ్‌ టెక్నిక్‌ అంటే...ఎడిటింగ్‌లో ఒక ప్రక్రియ. చిన్న చిన్న షాట్స్‌ను సమయానికి, స్పేస్, విషయానికి అనుగుణంగా ఉండేలా కుదించడం. 

ఈయన 1898 రిగాలో (ఇప్పటి లాత్వియాలో) జన్మించారు. ఆయన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించారు. బోల్షివిక్‌ విప్లవంలో కూడా పాల్గొన్నారు. తరువాత ఆయనకు సినిమాలపై ఇష్టమేర్పడి మాస్కోకు వెళ్లాడు. ఈయన మొదటి సినిమా స్ట్రైక్‌ 1925లో విడుదలైంది. రష్యాలోని కార్మికులు ఫ్యాక్టరీ ముందు చేస్తున్న ధర్నా నేపథ్యంలో చిత్రీకరించాడు. ఇది ఒక సైలెంట్‌(మూకీ)సినిమా. అదే సంవత్సరంలో బాటిల్‌షిప్‌ పొటెమ్‌కిన్‌ అనే మరో చిత్రాన్ని విడుదలచేశాడు. రష్యా సైనికులు అమాయకపు పౌరులను హతమార్చిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశాడు. 1928లో అక్టోబర్‌ అనే సినిమాను విడుదలచేశాడు. 1917 అక్టోబర్‌ విప్లవం, రష్యా నియంతృత్వ పాలన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాపై అప్పటి పాలకులు కన్నెర్ర చేశారు. అయినా కానీ ఐజిన్‌స్టైన్‌ వెనక్కితగ్గకుండా ఇంకా ఎన్నో మరుపు రాని చిత్రాలను తీశారు. అలెగ్జాండర్‌ నెవస్కీ, ఇవాన్‌ ది టెర్రిబుల్‌ లాంటి సినిమాలెన్నో తీసి...1948లో గుండెనొప్పితో మరణించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top