వైద్యం కోసం వెళుతున్న ఆయన్ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కళ్యాణదుర్గం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబదూరు వీఆర్‌ఏ రామన్న (54) దుర్మరణం చెందారు.
కళ్యాణదుర్గం : వైద్యం కోసం వెళుతున్న ఆయన్ను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. కళ్యాణదుర్గం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబదూరు వీఆర్‌ఏ రామన్న (54) దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. రామన్నకు బీపీ, షుగర్ ఉన్నాయి. భార్య అక్కమ్మకు అనారోగ్యంగా ఉండటంతో శుక్రవారం ఆమెతోపాటు తనూ వైద్యం చేయించుకునేందుకు రామన్న శుక్రవారం డీజిల్ ఆటోలో కళ్యాణదుర్గానికి బయల్దేరారు.
కళ్యాణదుర్గం సమీపంలోకి రాగానే పంది అడ్డురావడంతో అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. డ్రైవర్ పక్కన కూర్చున్న రామన్నపై ఆటో మీదపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కళ్లెదుటే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.