అంతర్‌జిల్లాల మహిళా క్రికెట్‌ విజేత కర్నూలు | The winner of the women's cricket Kurnool | Sakshi
Sakshi News home page

అంతర్‌జిల్లాల మహిళా క్రికెట్‌ విజేత కర్నూలు

Jul 23 2016 8:16 PM | Updated on Sep 4 2017 5:54 AM

అంతర్‌జిల్లాల మహిళా క్రికెట్‌ విజేత కర్నూలు

అంతర్‌జిల్లాల మహిళా క్రికెట్‌ విజేత కర్నూలు

కడప నగరంలో ఈనెల 18న ప్రారంభమైన సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల సీనియర్‌ మహిళా క్రికెట్‌ పోటీల విజేతగా కర్నూలు జట్టు నిలిచి కె.ఈ మదన్న స్మారక ట్రోఫీని అందుకుంది. రన్నరప్‌గా కడప జట్టు నిలిచింది.

కడప స్పోర్ట్స్‌:
కడప నగరంలో ఈనెల 18న ప్రారంభమైన సౌత్‌జోన్‌ అంతర్‌ జిల్లాల సీనియర్‌ మహిళా క్రికెట్‌ పోటీల విజేతగా కర్నూలు జట్టు నిలిచి కె.ఈ మదన్న స్మారక ట్రోఫీని అందుకుంది. రన్నరప్‌గా కడప జట్టు నిలిచింది. విజేతలకు ట్రోఫీ బహుకరణ కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సౌత్‌జోన్‌ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో చాలామంది క్రీడాకారిణులు తొలిసారి పాల్గొన్నారన్నారు. సీనియర్‌ క్రీడాకారుల నుంచి ఆటలో మెలుకువలు గ్రహించాలని సూచించారు. గతంతో పోల్చితే క్రికెట్‌లో మహిళలకు ఆదరణ గణనీయంగా పెరిగిందన్నారు. సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపికకాని క్రీడాకారిణులు నిరుత్సాహానికి లోనుకాకుండా మరింత సాధన చేస్తే అవకాశాలు ఉంటాయని సూచించారు. సౌత్‌జోన్‌ జట్టుకు ఎంపికైన క్రీడాకారిణులు రాష్ట్రస్థాయి మ్యాచ్‌లలో రాణించాలని సూచించారు. ఇండియన్‌ ఉమన్‌ క్రికెటర్‌ రావి కల్పన మాట్లాడుతూ క్రీడాకారిణులు చక్కటి ప్రతిభతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని సూచించారు. అనంతరం విన్నర్స్‌టీం, రన్నర్స్‌గా నిలిచిన జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కోశాధికారి వై.శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సభ్యులు మునికుమార్‌రెడ్డి, కోచ్‌లు ఖాజామైనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.
 కడపపై కర్నూలు ఘన విజయం..
వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్‌ మైదానంలో శనివారం నిర్వహించిన మ్యాచ్‌లో కడప, కర్నూలు జట్లుతలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులోని చంద్రలేఖ 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. శరణ్య 43, అనూష 37 పరుగులు చేసింది. కడప బౌలర్‌ ఓబులమ్మ 3 వికెట్లు తీసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 43.5 ఓవర్లలోనే 117 పరుగులకే ఆలౌట్‌ అయింది. జట్టులోని రోజా 46 పరుగులు చేసింది. కర్నూలు బౌలర్‌ అంజలి శర్వాణి 4 వికెట్లు, చంద్రలేఖ 2, సురేఖ 2 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 166 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో కర్నూలు జట్టు 4 పాయింట్లు పొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

చిత్తూరుపై నెల్లూరు విజయం...
కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో నెల్లూరు, చిత్తూరు జట్లు తలపడ్డాయి.టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140పరుగులు చేసింది. జట్టులోని డి. ప్రవళ్లిక 59, శరణ్య 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయం సాధించింది. జట్టులోని మాధురి 78, ఐశ్వర్య 14, సింధుజ 9 పరుగులు చేశారు. దీంతో నెల్లూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో నెల్లూరుకు 4 పాయింట్లు లభించాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement