అందరూ ఉన్నా అనాథలా అవ్వ | Sakshi
Sakshi News home page

అందరూ ఉన్నా అనాథలా అవ్వ

Published Fri, Aug 12 2016 1:06 AM

మృతదేహం వద్ద గుమిగూడిన గ్రామస్తులు,  కందిమళ్ల సరోజనమ్మ(80) (ఫైల్‌) - Sakshi

ఐదుగురు కొడుకులున్నా పట్టించుకోని వైనం
నిరాహారదీక్షతో తనువు చాలించిన దైన్యం
 
అశ్వాపురం:
ఐదుగురు కొడుకులున్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన 80 ఏళ్ల వృద్ధురాలు కందిమళ్ల సరోజనమ్మ గురువారం మృతిచెందారు. రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆమె ఆరోగ్యం గురువారం నాటికి పూర్తిగా క్షీణించింది. అటు అధికారులు కూడా స్పందించకపోవడంతో ఆమెకు మరణమే శరణ్యమైంది. వివరాల్లోకి వెళ్తే..
 
సరోజనమ్మకు ఐదుగురు కొడుకులతో పాటు ముగ్గురు కుమార్తెలు. ఈ ఐదుగురు కుమారుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కుమారుడు కందిమళ్ల కృష్ణారెడ్డి తల్లి సరోజనమ్మ పేరిట ఉన్న ఎనిమిదిన్నర ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు ఆమెకు తెలియకుండా నకిలీ సంతకాలతో పట్టా చేయించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించడంతో పాటు కొడుకులు పోషణ బాధ్యత చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సరోజనమ్మ బుధవారం నుంచి నిరాహారదీక్ష చేపట్టింది. అన్నపానీయాలు మాని దీక్ష చేస్తుండటంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబసభ్యులు, స్థానికులు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

గ్రామస్తుల ఆగ్రహం
రెండురోజులుగా 80 ఏళ్ల వృద్ధురాలు పంచాయతీ ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తుంటే కుటుంబసభ్యులు, అధికారులు స్పందించపోవడంపై మొండికుంట గ్రామస్తులు మండిపడ్డారు. అధికారులు ఆ వృద్ధురాలి సమస్య ఏమిటో కూడా తెలుసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement