మండల పరిధిలోని బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము ఇవ్వడం లేదంటూ శనివారం బెంగళూరు– పళ్లిపట్టు జాతీయ రహదారిపై వృద్ధులు, వితంతువులు ధర్నాకు దిగారు.
జాతీయ రహదారిపై బైఠాయింపు
కృష్ణజమ్మపురం(పాలసముద్రం): మండల పరిధిలోని బ్యాంకుల్లో పింఛన్ సొమ్ము ఇవ్వడం లేదంటూ శనివారం బెంగళూరు– పళ్లిపట్టు జాతీయ రహదారిపై వృద్ధులు, వితంతువులు ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 12 గంటల నుంటి 2 గంటల వరకు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పక్షంరోజులుగా గంటల తరబడి క్యూలో నిలుచున్నా.. డబ్బు ఇవ్వడం లేదని వాపోయారు. తమ వద్ద కేవలం రూ.2 వేల నోట్లే ఉన్నాయని, పింఛన్ డబ్బు రూ. 1000 ఇవ్వలేమని బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నట్లు వాపోయారు. ధర్నా వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో ఎంపీడీవో రుక్మణమ్మ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు రోజుల్లో పింఛను డబ్బు ఇంటివద్దే అందిస్తామని స్పష్టం చేశారు. దీంతో వారు ధర్నా విరమించారు.
వి. కోటలో..
వి.కోట: రోజుల తరబడి నగదు లేదని చెబుతుండడంతో వి.కోట ఆంధ్రాబ్యాంకు ఎదుట ఖాతాదారులు ఆందోళనకు దిగారు. అప్పటికీ సిబ్బంది స్పందించకపోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వల్ల తమ జీవితాలు అస్తవ్యస్తమవుతున్నాయని, రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో ఖాతాదారులు ఆందోళన విరమించారు.