పోలీసులే నేరస్తులు

Tamil Nadu Police Demanding Women Bribery Marijuana Smuggling - Sakshi

లంచం కోసం మహిళతో గంజాయి అమ్మకాలు

మరింత సొమ్ముకోసం బెదిరింపులు

డీఎస్పీ, సీఐ, గణాంకాల అధికారిపై ఏసీబీ కేసులు

సాక్షి ప్రతినిధి, చెన్నై:  నేరస్థులను పోలీసులు పట్టుకుంటారు. పోలీసులే నేరస్థులుగా మారితే....లంచం సొమ్ము కోసం నేరాలు చేయిస్తే దిక్కెవరు. నామక్కల్‌ జిల్లాలో అదే జరిగింది. మహిళ చేత బలవంతంగా గంజాయి అమ్మించిన నేరంపై ఇద్దరు పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారి ఒకరు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోట్టైకి చెందిన కుమార్‌ (24) గంజాయి వ్యాపారం చేస్తున్న కారణంగా గతంలో పోలీసులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. అతడి నుంచి 1,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని గూండా చట్టం కింద కేసులు పెట్టారు. భర్తను జైలు నుంచి బెయిలుపై విడుదల చేసేందుకు సేలంలోని మత్తుపదార్థాల నిరోధక విభాగ డీఎస్పీ కుమార్‌ను జైల్లో ఉన్న కుమార్‌ భార్య రాణి కలుసుకున్నారు. ఇతని పరిధిలో సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు ఉన్నాయి. డీఎస్పీ కుమార్‌ 2014లో రాణిని కలుసుకుని గంజాయి అమ్మకాల ద్వారా నెలకు లక్ష రూపాయల చొప్పున లంచం ఇస్తేనే నీ భర్త బెయిలుపై విడుదలకు సహకరిస్తానని చెప్పాడు.

అయితే అంతమొత్తం చెల్లించలేను, రూ. 25 వేలయితే సంపాదించగలనని చెప్పి గంజాయి అమ్మకాలు చేయసాగింది.. ఆ తర్వాత రాణి, ఆమెకు తెలిసిన మురుగన్‌ అనే వ్యక్తితో డీఎస్పీని పలు చోట్ల కలుసుకుంటూ అనేక వాయిదాల్లో సొమ్మును చెల్లిస్తూ వచ్చింది. ఒక సందర్భంలో ఆ మొత్తాన్ని సీపీ చక్రవర్తి అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో వేయాలని డీఎస్పీ తెలిపాడు. ఆ సీపీ చక్రవర్త తంజావూరులో ప్రభుత్వ గణాంకాలు, ట్రెజరీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను డీఎస్పీకి సన్నిహితుడు. ఇదిలా ఉండగా 2017 నవంబర్‌లో మత్తుపదార్థాల నిరోధక విభాగం ఇన్‌స్పెక్టర్‌ శాంత అనే మహిళ రాణిని బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. లంచం ఇవ్వకుంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించింది. దీంతో భయపడిపోయిన రాణి ఇన్‌స్పెక్టర్‌ శాంతకు రూ.45 వేలను మురుగన్‌ ద్వారా పంపింది. లంచం ముట్టజెపుతున్నా నెలరోజుల తర్వాత రాణిని, మురుగన్‌ను గంజాయి కేసులో ఇన్‌స్పెక్టర్‌ శాంత అదుపులోకి తీసుకుంది.  కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో రూ. 80 వేలు చెల్లించింది. మిగతా రూ. 1.20 లక్షలు త్వరలో చెల్లించాలని హెచ్చరించి వారిని పంపివేసింది. పోలీసుల వేధింపులు భరించలేని రాణి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తలదాచుకుంది. అయినా కూడా రాణీని వదలని డీఎస్పీ కుమార్‌ సెల్‌ఫోన్‌ ద్వారా మిగిలిన సొమ్ము ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో విరక్తి చెందిన రాణి సేలంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ కుమార్, ఇన్‌స్పెక్టర్‌ శాంత, గణాంకాల అధికారి సీపీ చక్రవర్తిలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top