నమ్మితే.. నయవంచనే!

MLA Vinay Bhasker Sad Manasa Murder Issue IN Warangal - Sakshi

 ప్రేమ పేరిట కామాంధుల మోసం

వరుస సంఘటనలతో భయంభయం

సాక్షి వరంగల్‌ :  ప్రేమకు పునాది నమ్మకం.. ఆ నమ్మకమే యువతుల పట్ల మరణ శాసనంగా మారుతోంది. ప్రేమ. ప్రేమా అంటూ తియ్యటి మాటలు చెప్పి యువతలను ఆకర్షించడం..  ఆ పైన సెల్‌ నంబర్‌ దొరికితే చాలు అమ్మాయి తనదేనని గర్వంగా స్నేహితులకు చెబుతున్న ఘటనలు కోకోల్లలుగా జరుగుతున్నాయి. ఇందులోలో కొన్ని ఘటనలు విషాదంగా ముగుస్తుండడం కుటుంబీకులకు తీరని ఆవేదనను మిగులుస్తున్నాయి. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో జరిగిన రెండు సంఘటనల్లో చివరకు అమ్మాయిలు ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. వరుసగా యువతులపై జరుగుతున్న దాడుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవువుతున్నారు. ప్రేమ పేరుతో వంచించే నయ వంచకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కళాశాలలకు వెల్లిన తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లిదండ్రులకు ప్రతి రోజు పరీక్షే అవుతోంది. ప్రమాదం ఎవరి రూపంలో వచ్చి ఏం చేస్తుందో తెలియక ప్రతీ క్షణం టెన్షన్‌తో బ్రతకాల్సిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో చోటు చేసుకుంటున్నాయి. సంఘటనల జరిగాక పోలీసులు ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా నిందితులు, మిగతా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.

పేద కుటుంబం.. ప్రేమ మోసం
నగరంలో నాలుగు నెలల్లో జరిగిన రెండు సంఘటనల్లో రెండు పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు అమ్మయిలు తనువు చాలించాల్సి వచ్చింది. కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఆగస్టు 10 జరిగిన సంఘటనలో సమ్మయ్యనగర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని వెన్నెలపై ఇద్దరు అత్యాచారం చేశారు. దీంతో ఆమె ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక, బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు కొయ్యడ తిరుపతితో పాటు మరో మైనర్‌ బాలుడు జైలు పాలయ్యారు. ఇంతలోనే మరో అమ్మాయి ప్రేమకు బలైంది. 

దీన్‌దయాళ్‌నగర్‌కు చెందిన గాదం మానస పేద కుటుంబానికి చెందిన యువతి. ఆమె తల్లిదండ్రులు గాదెం స్వరూప, మల్లయ్య గీసుగొండ మండలం కొమ్మాల నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరి వివాహం చేయగా, మరో ఇద్దరిని కూరగాయలు అమ్మి చదివిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడుగా షాపులో పనిచేస్తున్న క్రమంలో పులి సాయిగౌడ్‌ పరిచయం పెంచుకుని ఆ తర్వాత సెల్‌ నంబర్‌ తీసుకుని, ముందుగా చాలా మర్యాదగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఆ తర్వాత ప్రేమ మొదలుపెట్టాడు. అనంతరం తన కోసం బయటకు రాకుంటే చస్తానని బెదిరించి చివరకు బయటకు వచ్చిన తరువాత బలవంతంగా అత్యాచారం జరిపి హత్య చేయడం ఆ కుటుంబాన్ని ఎంతో కుంగుబాటుకు గురిచేసింది. ఈ రెండు సంఘటనల్లో అమ్మాయిలు కేవలం సెల్‌ఫోన్లలో నిందితులు ప్రేమగా మాట్లాడిన మాటలకు పొంగిపోయి... ఇంట్లో వారికి చెప్పకుండా నిందితుల వెంట వెళ్లి ప్రాణాలను కోల్పోయారు. మానస హత్యలో నిందితుడు సాయిగౌడ్‌ సుమారు ఆరు గంటల పాటు మృత దేహంతో ప్రయాణం చేసి , చివరకు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం.

ఏం జరుగుతుందో...
ఇంట్లో ఈడు వచ్చిన పిల్లలు ఉన్నప్పుడే ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కళాశాలలకు వెళ్లే అమ్మాయిలు, అబ్బాయిల దగ్గర రూ.వేల విలువైన సెల్‌ఫోన్లు ఉంటున్నాయి. వీటి ద్వారా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో, ఎవరితో ఎంత సేపు మాట్లాడుతున్నారో పట్టించుకునే తీరిక చాలా మంది తల్లిదండ్రులకు ఉండడం లేదు. కమిషనరేట్‌ పరిధిలో ప్రతీ వారం షీ టీమ్స్‌ అధికారులు ఈవ్‌టీజర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తుండగా.. ఇందులో 80 శాతం మంది కళాశాల విద్యార్థులే ఉంటున్నారు. అయితే, కౌన్సెలింగ్‌ తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోవడం ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది.

మృతదేహం వద్ద నివాళుర్పించిన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌
ఎంజీఎం : అత్యాచారం, హత్యకు గురైన మానస మృతహం వద్ద ప్రభుత్వ చీఫ్‌ వినయ్‌భాస్కర్‌ నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని సందర్శించి కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు ఘటనకు పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కాగా, పోస్టుమార్టం అనంతరం మానస మృతదేహాన్ని స్వగ్రామమైన కొమ్మాలకు తరలించగా రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top