పునరావాసం లేకే పునరావృతం

Mangarbasthi Criminals Again Chain Snatches - Sakshi

మళ్లీ నేరాలు చేస్తున్న మాన్గార్‌ బస్తీ నేరగాళ్లు

పోలీసులు చేపట్టిన మార్పు ప్రయత్నాలు వృథా

సహకరించేందుకు ముందుకు రాని ప్రభుత్వం

కనీసం కులధ్రువీకరణ పత్రాలూ ఇవ్వని వైనం

తాజాగా రాచకొండ సీసీఎస్‌కు చిక్కిన ముఠా

సాక్షి, సిటీబ్యూరో: మాన్గార్‌బస్తీ... ఈ పేరు వింటే పోలీసులు సైతం ఉలిక్కిపడతారు. చైన్‌ స్నాచింగ్, పిక్‌ పాకెటింగ్, దోపిడీ, దొంగతనాలు చేసే నేరగాళ్లకు ఈ ప్రాంతం కేరాఫ్‌ అడ్రస్‌. ఎన్నిసార్లు జైలుకు వెళ్లినా, చివరకు పీడీ యాక్ట్‌లు ప్రయోగించినా వీరిలో మార్పు రాలేదు. ఆ ప్రాంతంలో రైడింగ్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగి వచ్చిన పోలీసులూ ఉండరు. వీరిలో మార్పు తీసుకురావడానికి హబీబ్‌నగర్‌ పోలీసులు అహర్నిశలు కృషి చేశారు. అయితే ప్రభుత్వ విభాగాల నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో వారు మళ్లీ నేరబాటపట్టారు. ఉప్పల్‌ స్టేడియం కేంద్రంగా చేతివాటం చూపిస్తున్న ముఠాను ఇటీవల రాచకొండ సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. 

ఎనిమిది గ్యాంగులు...25 మంది సభ్యులు...
మహారాష్ట్రకు చెందిన మాన్‌గరోడి కులానికి చెందిన వారు గండిపేట చెరువు నిర్మాణం సమయంలో నగరానికి వలస వచ్చారు. ఆపై హబీబ్‌నగర్‌ పరిధిలో స్థిరపడిపోవడంతో అది మాన్గార్‌బస్తీగా మారిపోయింది. కొన్నాళ్లకు వీరు నేరగాళ్ళుగా మారిపోయి గ్రేటర్‌ పరిధిలో పంజా విసరడం మొదలెట్టారు. ఏటా వందల సంఖ్యలో నేరాలు చేçస్తూ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. దీంతో గత ఏడాది వీరిలో మార్పు తీసుకురావాలని హబీబ్‌నగర్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఎనిమిది ప్రధాన గ్యాంగుల్ని గుర్తించిన పోలీసులు వాటినే ‘టార్గెట్‌’గా చేసుకున్నారు. వివిధ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న వీటిలోని 25 మంది సభ్యులను సన్మార్గంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ఫలితంగా ఆ 25 మందీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరు అప్పటికే సిటీలోని 32 ఠాణాల పరిధిలో నమోదైన 200 కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లివచ్చారు. వివిధ పోలీసుస్టేషన్లలో 106 నాన్‌–బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. మరో 194 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నారు. ఒక్కొ క్కరి పైగా పదుల సంఖ్యలోనే కేసులు ఉన్నాయి. వీటిలో జేబు దొంగతనాల నుంచి దోపిడీల వరకు వివిధ నేరాలకు సంబంధించినవి ఉన్నాయి. వీలున్నంత వరకు వీటిని క్లియర్‌ అయ్యేలా హబీబ్‌నగర్‌ పోలీసులు ప్రయత్నించారు. ఇందుకు గాను  ఈ ఠాణా మాజీ ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌స్వామి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 

శిక్షణ ఇప్పించినప్పటికీ...
‘మాన్గార్‌’ నేరగాళ్లలో మార్పు తీసుకురావడం, పోలీసులకు లొంగిపోయేలా చేయడం ఒక ఎత్తయితే... వారు మళ్లీ పాతబాట పట్టకుండా చూడటం మరో ఎత్తని మధుకర్‌స్వామి భావించారు. ఇందుకుగాను వారికి మరో జీవనాధారం చూపించాలని ప్రయత్నించారు. అయితే కేవలం నేరాలు చేయడం మాత్రమే తెలిసిన మాన్గార్‌బస్తీ వాసులకు ఏ ఇతర స్కిల్‌ లేవు. ఎక్కడైనా చిన్నాచితక పనులు ఇప్పిద్దామని ప్రయత్నించినా వీరి ప్రవర్తన, గత చరిత్ర తెలిసిన వారు దగ్గరకు రానీయలేదు.  వీటిని దృష్టిలో పెట్టుకున్న ఆయన విడతల వారీగా వారికి చిలుకూరులోని ఆర్‌ఎస్‌ఈటీఐలో వృత్తి విద్యా శిక్షణ ఇప్పించారు. వైద్య శిబిరాల నిర్వహణతో పాటు యోగ, ధ్యానం, ప్రాథమిక విద్యలతో పాటు కారు డ్రైవింగ్, బేసిక్‌ మెకానిజం నేర్పించారు. భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మళ్లీ నేరబాట పట్టకుండా ఉండేలా వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ క్లాసులు ఏర్పాటు చేయించారు. తమ పేరు, కుటుంబీకుల పేర్లు ఇంగ్లీషులో రాయడం, సంతకం చేయడంతో పాటు క్యాబ్‌ డ్రైవర్లుగా మారితే జీపీఎస్‌ పరిజ్ఞానం వినియోగించడాన్నీ నేర్పారు. బస్తీ మహిళల కోసం ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి మాన్గార్‌బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లోనే శిబిరం ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నాలు సైతం చేశారు. 

ప్రభుత్వ విభాగాలు స్పందించకపోవడంతో...
పోలీసుల సహకారంతో డ్రైవింగ్‌లో పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు దొరికే ఆస్కారం లేదు. దీంతో అనివార్యంగా కొందరు క్యాబ్‌ డ్రైవర్లుగా మారాల్సి వచ్చింది. మాన్గార్‌బస్తీకి చెందిన వీరంతా మహారాష్ట్ర నుంచి వలసవచ్చారు. అక్కడ వీరిని ఎస్సీలుగా పరిగణిస్తూ ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సేకరించిన పోలీసులు రెవెన్యూ అధికారుల సాయం తో అందరికీ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయించడానికి ప్రయత్నించారు. ఇలా చేస్తే ఆ కార్పొరేషన్‌ నుంచి రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించవచ్చని భావించారు. అయితే ఓ పక్క ఈ కులధ్రువీకణ పత్రాలు జారీ, మరోపక్క ప్రభుత్వ విభాగాల స్పందన సైతం అంతంత మాత్రంగానే ఉండటంతో సన్మార్గం పట్టిన వారు సైతం పునరావాసం లేక కనీస అవసరాల కోసం అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ లోగా  ఇన్‌స్పెక్టర్‌ మధుకర్‌ స్వామి సైతం బదిలీ కావడంతో ‘మార్పు కార్యక్రమాలూ’ మూలనపడ్డాయి. దీంతో కొత్త జీవితాలపై ఆశ కోల్పోయిన మాన్గార్‌బస్తీ వాసులు మళ్లీ పాతబాటే పట్టారు. ఈ నేపథ్యంలోనే జుబ్బా ఆకాష్‌ గ్యాంగ్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం కేంద్రంగా నేరాలు చూస్తూ రాచకొండ సీసీఎస్‌కు చిక్కి జైలుకు వెళ్ళింది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పోలీసు విభాగంతో కలిసి పని చేయకపోతే మాన్గార్‌బస్తీ మార్పునకు ఆమడదూరంలో ఉండిపోతుంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top