కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది

Kondagattu Bus Accident Completes One Year - Sakshi

దేశచరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం 

65 మంది దుర్మరణం.. 50 మంది క్షతగాత్రులు

ఇంకా తేరుకోని బాధిత కుటుంబాలు

ఏడుగురు క్షతగాత్రులకు అందని పరిహారం

సాక్షి, చొప్పదండి: ఆ భయానక క్షణం ఇంకా వారిమదిలో మెదులుతోంది. ఆ బస్సు ప్రమాద గాయాలు నిత్యం సలుపుతున్నాయి. కన్నవారిని.. ఉన్నవారిని.. కట్టుకున్నవారిని.. ఆత్మీయులను.. అయినవారిని దూరం చేసుకుని ఏడాది అవుతున్నా.. ఆ కన్నీళ్లు నేటికీ ఆరడం లేదు. వారి కష్టాలు తీరడం లేదు. గుర్తుకొచ్చినప్పుడల్లా.. గుండెలవిసేలా రోదిస్తున్నారు. సరిగ్గా ఏడాది క్రితం.. అదో ఘోర కలి. దేశంలోనే అతిపెద్ద ప్రమాదం.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగి నేటికి ఏడాది.. 65మందిని పొట్టన పెట్టుకున్న ఆ ‘మృత్యుఘాట్‌’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. వందమందికి పైగా ప్రయాణించిన బస్సులో 24మంది ఘటనాస్థలంలో.. 41మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడవగా.. మరెందరో మంచానికే పరిమితమయ్యారు. బస్సు ప్రమాద బాధితుల్లో ఏడుగురికి పరిహారమే అందలేదు. దీంతో కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాల వారిని పలుకరిస్తే.. కన్నీళ్లే మాటలుగా వస్తున్నాయి. 

కొండగట్టు బస్సుప్రమాదం జరిగి నేటికి ఏడాదవుతున్నప్పటికీ.. నాటి పెనువిషాదం నుంచి కొడిమ్యాల మండలంలోని నాలుగు గ్రామాలు ఇంకా తేరుకోలేదు. చనిపోయినవారి జ్ఞాపకాలతో కుటుంబ సభ్యులు దుఃఖిస్తుండగా, మానని గాయాలతో, చికిత్సకోసం అయ్యే ఆర్థికఇబ్బందులతో క్షతగాత్రులు నరకయాతనను అనుభవిస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు, గాయపడ్డ బాధితుల ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. నాటి సంఘటనపై ఎవరిని కదిలించినా కన్నీళ్లు వెల్లువెత్తుతున్నాయి. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చిన బస్సుప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు కనిపించడంలేదు. ఆ ప్రమాదంలో 65 మంది మృతిచెందగా, 50 మంది గాయపడ్డారు. ప్రభుత్వం అందించిన పరిహారం బాధితకుటుంబాల వేదనను తీర్చలేదు. నాయకుల పరామర్శలు వారిలో ఆత్మస్థైర్యం నింపలేదు. విధివంచితులు తమ తలరాతలను తల్చుకుని తల్లడిల్లిపోతున్నారు.

చీకటి రోజుకు ఏడాది..
కొండగట్టు: చీకటి రోజుకు నేటితో ఏడాది. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఆ ఘ టనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైనాయి. గతేడాది సెప్టెంబర్‌ 11న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65మంది చనిపోయారు. క్షతగాత్రులు ఇప్పటికీ మంచాల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. 

ఘాట్‌రోడ్డు మూసివేత..
ఘటన జరిగిన వెంటనే అధికారులు ఘాట్‌రోడ్‌ను పూర్తిగా మూసివేశారు. ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వలేదు. అనంతరం రోడ్డు సెఫ్టీ అథారిటీ ఐపీఎస్‌ డీజీపీ కష్ణప్రసాద్, ఢీల్లీకి చెందిన పలు రోడ్డు సెఫ్టీ సంస్థలు, ఇతర అధికారులు ఘటనా స్థలారనికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించారు.

నూతన ఘాట్‌ ఇలా..
ఘటన తర్వాత అధికారులు దాదాపు కోటి రూపాయలతో ప్రమాద స్థలంతో పాటు మరికొన్ని చోట్ల రెయిలింగ్, క్రాష్‌ బేరియర్స్, బూమ్‌ బేరియర్స్, కల్వర్ట్స్, రక్షణ గోడలు, దొంగలమర్రి నుంచి నాచుపెల్లి జేఎన్‌టీయూ మీదుగా సూచికబోర్డులు ఏర్పాటు చేశారు. పాత ఘాట్‌ రోడ్డు 1.5కి.మీ ఉండగా రోడ్డు సెఫ్టీ, ఆర్‌అండ్‌బీ అధికారులు పర్యవేక్షించిన మార్పు చేసి 300మీటర్లు అదనంగా పెంచారు. దొంగలమర్రి నుంచి నాచుపెల్లి, జేఎన్టీయూ, అక్కడనుంచి కొండమీద ఉన్న వై జంక్షన్‌ సమీపంలోని హరిత హోటల్, ఆలయం ఎదురుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌ దిగువ వరకు, అక్కడి నుంచి ప్రమాదం జరిగిన స్థలం వరకు కొత్త రోడ్డుమ్యాప్‌ 9.6 కిలో మీటర్లు సిద్ధం చేశారు. రూ.111 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

10కి.మీ. అదనపు రవాణా..
ఘాట్‌రోడ్డు బంద్‌ కావడంతో దిగువ కొండగట్టు నుంచి దొంగలమర్రి మీదుగా గుట్టమీదకు చేరుకునేందుకు దాదాపు 10కి.మీ. ప్రయాణం పెరిగింది. దీంతో భక్తులకు కావాలసిన వాహనాలు ఆర్టీసీ వారు ఏర్పాటు చేశారు. చిన్నపాటి అవస్థలు పడుకుంటూ భక్తులు కొండకు చేరుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నారు.

అంతుచిక్కని వైనం..
ఘాట్‌రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ అధికారులు అధికారికంగా తెలపడంలేదు. డ్రైవర్‌ నిర్లక్ష్యమా? బ్రేకులు ఫెయిల్‌? అధిక లోడ్‌? బస్సు ఫిట్‌నెస్‌ లేకపోవడం?ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు కొండ మీద నుంచి మరో బస్సును నడిపి పరీశీలించారు. స్థానిక అధికారులు, ఢిల్లీ  నిపుణులు కొండకు వచ్చి అనేక విధాలుగా ఆధారాలు సేకరించుకొని వెళ్లారు తప్ప నేటికి ప్రమాదం ఎలా జరిగిందో స్పష్టం చేయలేకపోయారు. బస్సు నేటికి మల్యాల పోలీస్‌స్టేషన్‌ వద్దే ఉంది.

బతికున్నందుకు బాధపడుతున్నా..
శనివారంపేటకు చెందిన గోలి లక్ష్మికి అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు తోడుకోసం కోనాపూర్‌లో ఉండేకూతురు ఎల్లమ్మను రమ్మంది. బస్సుప్రమాదంలో కూతురు చనిపోయింది. లక్ష్మి రెండుకాల్లు, రెండుచేతులు విరిగాయి. నుజ్జునుజ్జయిన ఎడమకాలును వైద్యులు మోకాలు పైభాగం వరకు తొలగించారు. మిగతా కాలు, రెండు చేతులకు రాడ్లువేశారు. లక్ష్మి తానున్నచోటునుంచి కదలలేదు. కొట్టివేసిన కాలుకు ఇన్ఫెక్షన్‌ వచ్చి చీముకారుతుంద ని, నొప్పి భరించలేకపోతున్నానని వృద్ధురాలు చేసే రోదనలు చుట్టుపక్కలవారికి కంటనీరు తెప్పిస్తున్నాయి. ప్రతీ పదిహేను రోజులకోసారి జగిత్యాలలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అయ్యే ఆర్థికభారాన్ని వారి పేదకుటుంబం భరిం చలేకపోతోంది. లక్ష్మికి కాలు తొలగించినా వికలాంగ పెన్షన్‌ రావడంలేదు. తనకు జైపూర్‌కాలును అమర్చాల ని బాధితురాలు కోరుతున్నది. అమ్మమ్మ వెంట తీసుకెళ్లడంతోనే తన తల్లి చనిపోయిందని మనవడు సరిగా మాట్లాడడంలేదు.  తానుకూడా అదేరోజు కూతురుతోపాటు చనిపోతే బాగుండేదంటున్న వృద్ధు రాలి వేదన కఠిన హృదయాలను సైతం కరిగించేలా ఉన్నది.                                   

నడవలేక నరకయాతన..
హిమ్మత్‌రావుపేటకు చెందిన పెంచాల లక్ష్మి, కూతురు సౌందర్య ప్రమాదంలో గాయపడ్డారు. ఉపాధి కోసం బ్రూనై వెళ్లిన భర్త నర్సయ్య తిరిగివచ్చాడు. లక్ష్మి కాలుచర్మం పూర్తిగా పాడవడంతో శరీరంలోని వేరేప్రదేశంలోని చర్మాన్నితీసి కాలుకువేశారు. కాలుకు, చేయికి రాడ్‌వేశారు. కొత్తగా వేసిన చర్మానికి ఇన్ఫెక్షన్‌వచ్చి కాలు వాచింది. మంచం దిగి నడవలేని పరిస్థితిలో వేదనపడుతున్నది.
– తల్లితో సౌందర్య  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top