ప్రేమ పేరుతో పోలీస్ హోంగార్డు మోసం

Home Guard Cheats Woman In komaram Bheem District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు పోలీసుల చర్యలు ఆ శాఖ  పరువు తీస్తున్నాయి. దీంతో పోలీసు ఉద్యోగుల వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే కొమురం ఆసిఫాబాద్‌ జిల్లాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి  మహిళల అక్రమరవాణా కేసులో  జైలుపాలయ్యాడు. ఇక లక్సెట్టిపేటకు చెందిన రిజర్వ్‌ సీఐ శ్రీనివాస్‌పై 498-ఎ కేసు విచారణ జరుగుతోంది. తాజాగా ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ యువతి గర్భందాల్చి బిడ్డకు జన్మనిస్తూ  మృతి చెందింది. ఇందుకు జిల్లాకు చెందిన ఓ హోంగార్డే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసుల ప్రవర్తనపై జిల్లా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో విధులు నిర్వహిస్తున్న సజ్జన్‌లాల్ ధాంపూర్‌కు చెందిన అరుణ అనే యువతిని ప్రేమపేరుతో గర్భవతిని చేశాడు. ఆమె ఆదివారం ఆసిఫాబాద్‌లో మగబిడ్డకు జన్మనిచ్చి అనంతరం మృతి చెందింది. అయితే గతంలోనే సజన్‌ లాల్‌కు పెళ్లి కాగా, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా ప్రేమ, పెళ్లి పేరుతో అరుణను లోబరచుకుని గత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గర్భవతి అయిన ఆమెకు ఇవాళ ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకు వెళ్లకుండా ఆలస్యం చేశాడు. దీంతో ఆమె దారిలోనే బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడంతో మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి అక్కడ నుంచి సజ్జన్‌ లాల్‌ పరారయ్యాడు.  అరుణ మృతితో న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని తీసుకు వెళ్లేది లేదని  ఆమె కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట బైఠాయించారు.

కాగా సజన్‌ లాల్‌ వ్యవహారంపై గతంలోనే ఆసిఫాబాద్‌ పోలీసులకు అరుణ బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే తన చెల్లెలు చనిపోయిందని అరుణ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సత్యనారాయణ...బాధితురాలి కుటుంబసభ్యులను సముదాయించి, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఇక పుట్టిన బిడ్డను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top