అమానుషం

Five Boys Molestation On Girl In Chittoor - Sakshi

బాలికపై సామూహిక లైంగిక దాడి

ఐదుగురు మైనర్ల అఘాయిత్యం

మూడు నెలలుగా జరుగుతున్న ఘోరం

చెబితే చంపుతామంటూ బెదిరింపులు

ఎట్టకేలకు తల్లివద్ద బోరుమన్న బాలిక

జువైనల్‌ హోంకు నిందితుల తరలింపు

వారంతా యువతరంలోకి అడుగుపెడుతున్న బాలలు..కన్ను మిన్ను గానక తప్పు చేశారు. పదకొండేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఒకసారి కాదు..ఒక రోజు కాదు.. మూడు నెలలుగా మైనరు బాలికను శారీరకంగా హింస పెడుతూనే ఉన్నారు. చెబితే చంపేస్తామని బెదిరించేవారు. ఎవరికి చెబితే ఏమవుతుందోనని కొండంత కష్టాన్ని గుండెల్లో దాచుకుంది ఆ చిన్నారి.. వారు చూపిస్తున్న నరకం నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు..ఈనేపథ్యంలో ఈ గోప్య సమాచారం బయటకు పొక్కింది. కొందరు చర్చించుకోవడం సాక్షాత్తూ బాధిత బాలిక తల్లి చెవిలో పడింది. ఆమె నిశ్చేష్టురాలయ్యింది. అభం శుభం తెలియని తమ బిడ్డపట్ల అమానుషంగా ప్రవర్తించిన కిరాతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వెంటనే ఇద్దరు నిందితుల్ని స్థానికులు బంధించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు రాత్రికి రాత్రే రంగంలోకి దిగి మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేశారు. మైనరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారి వయసు తక్కువ..సాధారణ జైలుకు పంపే వీలు లేదు. దీంతో చట్టప్రకారం తిరుపతిలోని జువైనల్‌ హోంకు తరలించారు. బాధితురాలిని పలమనేరు ఆస్పత్రికి పంపారు. మానవత్వానికి మచ్చ తెచ్చిన ఈ సంఘటన పుంగనూరు పట్టణంలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. ఈ కారణంగా తెల్లవార్లూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులందరూ పట్టుబడడంతో స్థానికులు..బాధిత బాలిక తల్లిదండ్రులు శాంతించారు. 

గనూరు : జిల్లాలోని శ్రీకాళహస్తి, పాలసముద్రం, కల్లూరు ప్రాంతాల్లో చిన్నారులపై జరిగిన లైంగిక వేధింపులను మరిచిపోకముందే పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో బాలిక(11)పై ఐదుగురు బాలురు రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలనీకి చెందిన బాలికను 3 నెలల క్రితం అదే కాలనీకి చెం దిన బాలుడు మాయమాటలు చెప్పి సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూపించి లొంగదీసుకున్నాడు. తన స్నేహితులు నలుగురికి తెలిపాడు. అందరూ కలిసి రెండు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బాలికను బెదిరించారు. దీని గురించి స్నేహితులు ఒకచోట చేరి మాట్లాడుకుంటుండగా స్తానికులు విని బాలిక తల్లికి చెప్పారు.

దీంతో దురాగతం బయటపడింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారు పెద్దగా చదువుకోకపోవడం, తల్లిదండ్రులు కూలి పనులకు వెళుతూ పిల్లలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆకతాయిలుగా తిరుగుతూ ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డారు. జిల్లాలో ఈ మధ్య వరుసగా చోటుచేసుకుంటున్న  ఇటువంటి సంఘటనలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

వారం రోజులైనా కాకుండానే..
ఆడపిల్లలకు రక్షగా నిలుద్దామంటూ జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న, మహిళా కమిషన్‌ సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, ఇతర ప్రముఖులు పుంగనూరు పట్టణంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని కాముని దహనం చేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం జరిగి వారంరోజులైనా గడువక ముందే ఇటువంటి సంఘటన జరగడంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిక్షలు కఠినంగా లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బాలికకు పలమనేరులో వైద్యపరీక్షలు
గంగవరం: పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో అత్యాచారానికి గురైన బాలికకు డీఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో గురువారం వైద్యపరీక్షలు నిర్వహించారు. డీసీహెచ్‌ఎస్‌ సరళాదేవి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి బంధువులతో మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top