
దీపావళికల్లా పుత్తడి రూ.23 వేలు!
బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దీపావళి నాటికి పది గ్రాముల ధర రూ.23 వేలకు చేరుకునే అవకాశాలున్నాయని యూబీఎం ఇండియా జువెల్లరీ ఎగ్జిబిషన్స్ పోర్ట్‌ఫోలియో గ్రూప్ డెరైక్టర్ క్రాంతి నాగ్వేకర్ చెప్పారు.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దీపావళి నాటికి పది గ్రాముల ధర రూ.23 వేలకు చేరుకునే అవకాశాలున్నాయని యూబీఎం ఇండియా జువెల్లరీ ఎగ్జిబిషన్స్ పోర్ట్‌ఫోలియో గ్రూప్ డెరైక్టర్ క్రాంతి నాగ్వేకర్ చెప్పారు. సోమవారమిక్కడ ‘హైదరాబాద్ జువెల్లరీ పెరల్, జెమ్ ఫెయిర్’ను ప్రకటించిన సందర్భంగా ఆమె ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. బంగారం దిగుమతి నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సరళీకరించడంతో ఆభరణాల, విలువైన రాళ్ల పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపుతోందన్నారు. ‘‘రానున్న బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 4 శాతానికి త గ్గించే అవకాశం ఉంది. బంగారం దిగుమతికి మరికొన్ని సంస్థలకు అనుమతి ఇవ్వడం కూడా ధర తగ్గడానికి కారణం’’ అని వివరించారు.
త్వరలో దోరే గోల్డ్..
ఇప్పటివరకు వివిధ దేశాల్లోని రిఫైనరీల్లో శుద్ధి చేసిన 999 స్వచ్ఛత గల మేలిమి బంగారాన్ని దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే కొత్త ప్రభుత్వం త్వరలో గనుల నుంచి పూర్తిగా శుద్ధి చేయని స్క్రాప్ గోల్డ్ (దోరే గోల్డ్)ను దిగుమతి చేసుకునేందుకు ఆమోదం తెలిపే అవకాశముందని ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ జువెల్లరీ అండ్ డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బురుగు సూర్య ప్రకాశ్ చెప్పారు. మన దేశంలో కర్ణాటకలోని కోలార్‌లో, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత మొత్తంలో బంగారం, వజ్రాల గనులున్నాయి.
ఇవి దేశీ మార్కెట్‌కు ఏమాత్రం సరిపోవు. అందుకే దేశీయంగానే రిఫైనరీల్లో దీన్ని శుద్ధి చేసి ‘దోరే గోల్డ్’గా మార్కెట్లోకి రానుంది. ఇలా వంద టన్నుల మేర దోరే గోల్డ్ అనుమతించవచ్చు. పారదర్శకత విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి బంగారాన్ని నగదుతో కొనుగోలు చేస్తే ఆదాయం పన్ను ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. ఈ మొత్తాన్ని రూ.50 వేలకు పరిమితి చేయనున్నారు. దీంతో పసిడి విక్రయాలపై పారదర్శకత పెరిగే అవకాశమూ ఉంది.
మరో 200 టన్నుల బంగారం..
ప్రస్తుతం దేశీయ ఆభరణాల వ్యాపారంలో 50-60 శాతం మేర పాత బంగారం మార్పిడిపై జరుగుతున్నాయి. దీంతోపాటు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వద్ద తనఖా నుంచి వేలం ద్వారా మరో వంద టన్నుల బంగారం మార్కెట్లోకి చేరే అవకాశముంది. అంటే నేరుగా దిగుమతి చేసుకునే 450-500 టన్నులతో పాటు మరో 200 టన్నుల వరకూ బంగారం అందుబాటులోకి రానుందన్నమాట. పసిడి ధరల్లో అధిక హెచ్చుతగ్గులు లేనందున విలువ పెరుగుతుందనే భావనతో కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గుతుంది. ఫలితంగా మార్కెట్ అవసరాలకు ఈ బంగారమే సరిపోతుంది.
జూన్ 7-9 వరకు హైదరాబాద్ జువెల్లరీ పెరల్, జెమ్ ఫెయిర్
జూన్ 7-9 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ‘హైదరాబాద్ జువెల్లరీ పెరల్, జెమ్ ఫెయిర్-2014’ జరగనుంది. రోజుకో కొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి వస్తున్న ఆభరణాల గురించి ప్రచారం చేసేందుకు ఈ ప్రదర్శన. ఇందులో మన రాష్ట్రంతో పాటు జైపూర్, కోల్‌కతాల నుంచే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా వంటి ఇతర దేశాల తయారీ సంస్థలు కూడా పాల్గొంటాయి. సుమారుగా 130 ఎగ్జిబిటర్స్ పాల్గొననున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్నిరకాల డిజైన్లు చూడొచ్చు. ఈ సమావేశంలో హైటెక్‌సిటీ జువెల్లరీ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (హెచ్‌జేఎంఏ) అధ్యక్షుడు మహేందర్ థాయల్ తదితరులు పాల్గొన్నారు.