కొన్ని రకాల స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ హేతుబద్దీకరణకు ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం అనివార్యం కానుంది. స్థిరాస్తి దాన దానం
సాక్షి, హైదరాబాద్: కొన్ని రకాల స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ హేతుబద్దీకరణకు ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం అనివార్యం కానుంది. స్థిరాస్తి దాన దానం (బహుమతి), ఆస్తి పంపకాలు (సెటిల్‌మెంట్), తనఖా, లీజు దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ తగ్గింపునకు సంబంధించిన ఫైలుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సంతకం చేశారు. ఇందుకు సంబంధించి గురవారమే ఉత్తర్వులు వెలువడవలసి ఉంది. సాయంత్రానికల్లా జీవో జారీ అవుతుందని పేర్కొన్నా అధికారులు చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించారు. ఫైలును న్యాయ శాఖకు పంపించాలని నిర్ణయించారు.
న్యాయ శాఖ అనుమతి తర్వాతే జీవో జారీ చేయాలన్న అధికారి సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫైలు న్యాయ శాఖకు వెళ్లి రావడానికి వారం పైగా పడుతుందని, తర్వాతే జీవో ఇస్తారని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘గతంలో మార్కెట్ విలువల సవరణ ఉత్తర్వు జారీ తర్వాత దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయినపుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాల్సి వచ్చింది. అందువల్లనే తాజాగా, న్యాయ శాఖ అనుమతి తర్వాతే ఉత్తర్వు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఒక అధికారి చెప్పారు.