పచ్చ స్మగ్లర్ల పరార్ | Red sandalwood smugglers escaped | Sakshi
Sakshi News home page

పచ్చ స్మగ్లర్ల పరార్

Jun 20 2015 2:39 AM | Updated on Aug 21 2018 6:08 PM

పచ్చ స్మగ్లర్ల పరార్ - Sakshi

పచ్చ స్మగ్లర్ల పరార్

ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడిన, స్మగ్లర్లకు

సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడిన, స్మగ్లర్లకు సహకరించిన వారెవరైనా సరే చర్యలు తప్పవనే సంకేతాలు స్పష్టం కావడంతో పలువురు స్మగ్లర్లు జిల్లా వదిలివెళ్లినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ నేతృత్వంలో ఓ వైపు టాస్క్‌ఫోర్స్, మరో వైపు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ వ్యూహాత్మకంగా దూసుకు పోతుండటంతో స్మగ్లర్లలో వణుకు ఆరంభమైంది. ఇటీవలి కాలంలో చైనా, ఢిల్లీ, హర్యానాకు చెందిన స్మగ్లర్ల అరెస్టుతో అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లను భయం వెంటాడుతోంది.

 ఇక నుంచి మరింత దూకుడు
 ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు మరింత దూకుడు పెంచనున్నారు. ఓఎస్‌డి రాహుల్ దేవ్ శర్మ ప్రస్తుత దృష్టి ఎర్రచందనం అక్రమ రవాణాపై మాత్రమే ఉండటంతో ఎర్ర స్మగ్లర్లనందరినీ అణిచివేయడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నారు. అడవిలో ఓ వైపు కూంబింగ్  కొనసాగిస్తూనే, రహదారుల్లో ముఖ్యమైన చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. అడవిలో కూలీలు, స్మగ్లర్లను ఎదుర్కోనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులకు వివరిస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. తద్వారా ఎర్ర స్మగ్లర్లను సులువుగా పట్టుకోడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. 

 అండర్ గ్రౌండుకు స్మగ్లర్లు
 ప్రస్తుత పరిణామాల రీత్యా ‘ఎర్ర’ వ్యవహారంతో సంబంధం ఉన్న ‘పచ్చ’ నేతలు పలువురు అండర్ గ్రౌండుకు వెళ్లినట్లు సమాచారం. ఒక్కొక్కరే ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. సుండుపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెండు నెలలుగా కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ పచ్చ స్మగ్లర్‌పై చిత్తూరు జిల్లాలో ఏడెనిమిది కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో ఈ ప్రాంతంలో ఉండటం అంత మంచిది కాదని కొందరు అధికార పార్టీ నేతలు సలహా ఇవ్వడంతో చెన్నైకి అని చెప్పి కర్ణాటకకు వెళ్లినట్లు సమాచారం. సిద్దవటం ప్రాంతానికి చెందిన మరో పచ్చ నేత కూడా అండర్ గ్రౌండుకు వెళ్లినట్లు తెలిసింది.

 సేలం స్మగ్లర్ల కోసం వేట
  తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కొంత మంది ఎర్రచందనం అక్రమ రవాణాలో తలదూర్చినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పాత స్మగ్లర్ల కదలికలపై కూడా నిఘా ముమ్మరం చేశారు. బయటి ప్రాంతాల్లో ఎర్ర చందనం కొంటున్న బడా స్మగ్లర్ల భరతం పడితే స్థానికంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా బయటి ప్రాంతాల్లోని స్మగ్లర్లపై కూడా దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement