కంది రాదు... కూరలేదు

No Toor In Ration Shops - Sakshi

ఇంతవరకు చౌక దుకాణాలకు చేరని కందిపప్పు

రెండు నెలలకే పరిమితమైన రాగుల పంపిణీ

ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం

ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు చందంగా మారింది నేడు నిరుపేదల పరిస్థితి. దీంతో వారు నిత్యావసర వస్తువులు సైతం కొనుగొలు చేయలేకపోతున్నారు. ఈ దశలో ప్రభుత్వం చౌకదుకాణాల్లో తెల్ల రేషన్‌ కార్డులున్న వారందరికీ మార్చి నుంచి కిలో కంది పప్పు ఇస్తామని ప్రకటించింది. కొంత ఊరట లభిస్తుందిలే అని కార్డుదారులు ఆశ పడ్డారు. తీరా రేషన్‌ షాపుకెళితే కంది రాలేదన్నారు. ఫలితంగా కూర లేక నిరుపేదలు ఇక్కట్లు పడుతున్నారు.

చిత్తూరుకలెక్టరేట్‌: తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ బియ్యంతోపాటు మార్చి నుంచి కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మార్చి నుంచి అందించాల్సిన కందిపప్పు కానరాలేదు. అలాగే గతంలో అమలు చేసిన రాగుల పంపిణీ పథకం రెండు నెలలకే అటకెక్కింది. ప్రజలు మాత్రం ఈ నెల నుంచి రాగులుతో పాటు కందిపప్పు కూడా అందుతుందని భావించారు. తీరా చౌకదుకాణానికి వెళితే ఆ ఊసే లేదు.

జిల్లాలో మొత్తం 11, 07,911 కుటుంబాలకు తెల్లరేషన్‌ కార్డులున్నాయి. అందులో అంత్యోదయ కార్డులు 86,811, అన్నపూర్ణ కార్డులు 926 ఉన్నాయి. వీరికి గత ప్రభుత్వ హయాంలో బియ్యంతోపాటు చక్కెర, కిరోసిన్, గోధుమలు, కందిపప్పు తదితరాల నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగేది. అయితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా చౌకదుకాణాల ద్వారా ఇచ్చే నిత్యావసర సరుకులకు మంగళం పాడుతూ వచ్చింది. దీంతో ఆఖరుకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. అయితే రెండు నెలలుగా బియ్యంతోపాటు ప్రతి కార్డు దారునికి రెండు కిలోల రాగులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాగులు తీసుకున్న కార్డు దారులకు కేటాయించిన బియ్యంలో కోత విధించింది. ఈ విధానంతో రెండు నెలలు మాత్రం లబ్ధిదారులకు రాగులను పంపిణీ చేసింది. దీంతోపాటు మార్చి నెల నుంచి కందిపప్పు కూడా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కిలో కందిపప్పు రూ.40 చొప్పున, ఒక్కొ కార్డుకు ఒక కిలో చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం జిల్లాకు మొత్తం 1,100 టన్నుల కందిపప్పును కూడా ఆయా చౌకదుకాణాలకు అందించినట్లు తెలియజేసింది.

వచ్చే నెల నుంచి అందిస్తాం
కందిపప్పు, రాగులు ఏప్రిల్‌ నుంచి అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాగులు స్టాక్‌ రానందున అందించలేకపోయాం. కందిపప్పు కూడా ఫిబ్రవరి 28వ తేదీ స్టాక్‌ వచ్చినందున ఏప్రిల్‌ నుంచి పంపిణీ చేస్తాం. కందిపప్పు 1,100 టన్నులు, రాగులు 500 టన్నుల మేరకు అందించేలా చర్యలు చేపడుతున్నాం. – జయరాములు, జీఎం, జిల్లా పౌరసరఫరాల శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top