సమైక్య శంఖారావం పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన తొలి బహిరంగ సభకు తిరుపతి జనం బ్రహ్మరథం పట్టారు.
సాక్షి, తిరుపతి: సమైక్య శంఖారావం పేరుతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన తొలి బహిరంగ సభకు తిరుపతి జనం బ్రహ్మరథం పట్టారు. ఇడుపుల పాయలో సోమవారం ఉదయం ప్రారంభించిన బస్సు యాత్ర సాయంత్రం తిరుపతికి చేరుకుంది. వెంకన్న పాదాలచెంత తొలి బహిరంగ సభకు షర్మిలతో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హాజరయ్యారు.
వీరిద్దరూ సాయంత్రం 6.10 గంటలకు సభాప్రాంగణానికి చేరుకున్నారు. విజయమ్మ, షర్మిల ప్రసంగాలను జనం మంత్రముగ్ధుల్లా విన్నారు. ‘నేను మీ రాజన్న బిడ్డను... మీ జగనన్న చెల్లెలిని’ అంటూ ప్రసంగం ప్రారంభించగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ‘నేను జగనన్న పూరించిన సమైక్య శంఖారావాన్ని’ అనగా, ఆమెకు చేతులెత్తి అభివాదం చేశారు. సభా ప్రాంగణంలోని అశేష జనం హర్షధ్వానాలతో ఆమె మాటలకు మద్దతు పలికారు.
చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
ఆత్మేలేని చంద్రబాబుకు గౌరవం ఎక్కడ నుంచి వస్తుందని బహిరంగ సభలో షర్మిల ప్రశ్నించారు. దీనిపై ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, తెలుగు ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రధాన పార్టీలుంటే, మూడు పార్టీలు వైఎస్సార్ సీపీ, ఎంఐఎం, సీపీఎం విభజనకు అంగీకరించకపోయినా, ఏకాభిప్రాయం కుదిరినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రెండు పార్టీల నిరంకుశ ధోరణికి నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న రెండు పార్టీలకు జైలులో ఉంటూనే ముచ్చెమటలు పోయిస్తున్నారని తెలిపారు. జగనన్న మాటగా సమైక్యంగా ఉండాలని ఆమె ప్రసంగాన్ని ముగించారు.
సమన్యాయం కావాలి
వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతూ సమన్యాయం చేయాలని పలుసార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేద న్నారు. ముందుగా జగన్ నిరాహారదీక్ష చేస్తానంటే, ఆయనకు బదులుగా తాను చేస్తానని గుంటూరులో దీక్ష చేపట్టినట్లు తెలిపారు. అయితే తన దీక్షను భగ్నం చేయడంతో, జగన్ జైలు నుంచే దీక్ష చేపట్టాడని అన్నారు. కేంద్రం చేసిన విభజన ప్రకటనతో సచివాలయం, విద్యుత్‌సౌథ తదితర కార్యాలయాల్లో ఉద్యోగులు రెండు వర్గాలయ్యారని అన్నారు. వైఎస్‌మూడు ప్రాంతాలకు సమన్యాయం చేశారని అన్నారు.
విద్యుత్ నిలిపేసిన ప్రభుత్వం
షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం సమావేశం ఆలస్యం కావడంతో, చీకటి పడింది. దీంతో ప్రభుత్వం విద్యుత్ నిలిపేసి కసి తీర్చుకుంది. షర్మిల ప్రసంగిస్తున్న వేదిక మీద ఆరు లైట్ల పోల్‌ఉన్నా, అది పనిచేయనీయకుండా చేశారు. దీంతో చీకటి మధ్య సమావేశం జరి గింది. టీవీ చానళ్ల వెలుగులో ఆమె ప్రసంగం కొనసాగింది. అంత చీకట్లోనూ ఆమె కోసం వచ్చిన ప్రజలు అక్కడ నుంచి కదలకుండా ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ మరణంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఆయన మరణాన్ని హత్యగానే పేర్కొన్నారు.
సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, కొడాలినాని, పేర్నినాని, పార్టీ నాయకులు ఆర్‌కే రోజా, వాసిరెడ్డి పద్మ, చెవిరెడ్డిభాస్కర్ రెడ్డి, కాపుభారతి, వరప్రసాదరావు, ఓవీ రమణ, ఆదిమూలం, పోకలఅశోక్‌కుమార్, తలుపులపల్లెబాబురెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, యువజన కన్వీనరు ఉదయకుమార్, మహిళా కన్వీనర్ గాయత్రీదేవి, పాలగిరి ప్రతాప్‌రెడ్డి, చెలికం కుసుమ, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, ఎస్‌కే బాబు, చెంచయ్య యాదవ్, తొండమనాటి వెంకటేష్, రాజేంద్ర పాల్గొన్నారు.