పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు.
ముదిగుబ్బ, న్యూస్‌లైన్: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరితో పాటు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ధర్మవరం ఆర్‌డీఓ నాగరాజు, మార్కెట్ యార్డ్ చెర్మైన్ రామకృష్ణారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వర్తింపజేయడమే రచ్చబండ ఉద్దేశ్యమన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. ఇందుకోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇటీవల గవర్నర్‌తో పాటు పలు పార్టీల జాతీయ నాయకులను కలిసి రాష్ర్ట సమైక్యతకు సహకరించాల్సిందిగా కోరానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసే ప్రజలు తనను గౌరవిస్తున్నారన్నారు. ఇందిరమ్మ పక్కా గృహాల నిర్మాణ వ్యయాన్ని ఎస్సీ, ఎస్టీలు, ఇతరులకు పెంచారన్నారు.అనంతరం 1,800 రేషన్ కూపన్లు, 800 పక్కా ఇళ్లు, 755 పెన్షన్ మంజూరుపత్రాలను మంత్రి, ఎమ్మెల్యే, పంపిణీ చేశారు.