
20 నుంచి మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మె
సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపడుతోంది.
విజయవాడ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేపడుతోంది. శనివారం కృష్ణాజిల్లా గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో 13 జిల్లాలకు చెందిన మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులు, సీఎంఎఫ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ ఉద్యోగుల సమావేశం జరిగింది. జేఏసీ చైర్మన్ రామాంజనేయులు (కడప జేడీ) మాట్లాడుతూ, ఈనెల 20 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి సమావేశం తీర్మానించిందన్నారు. ఎన్‌జీఓలు ఎప్పటివరకు బంద్ నిర్వహిస్తారో అప్పటివరకు మార్కెటింగ్ శాఖ జేఏసీ నిరవధిక సమ్మెలో కొనసాగుతుందన్నారు. ఈ నెల 17వ తేదీన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్‌కు, ప్రిన్సిపల్ కార్యదర్శికి నిరవధిక సమ్మె నోటీసులను అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చే వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యాలయాలను మూసివేసి, విధులను బహిష్కరిస్తామన్నారు.
26 మందితో జేఏసీ
26 మంది ఉద్యోగులతో ఏర్పడి న జేఏసీ చైర్మన్‌గా కడప జేడీ రామాంజనేయులు, కో- చైర్మన్లుగా ఆర్. లక్ష్మణుడు (వైజాగ్ జేడీ), డెప్యూటీ డెరైక్టర్ సుధాకర్ (వైజాగ్), రామ్మోహన్‌రెడ్డి (అనంతపురం కార్యదర్శి), కె. జయశేఖర్ (విజయవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), కన్వీనర్‌గా డెప్యూటీ డెరైక్టర్ ఎం. దివాకరరావు (విజయవాడ), కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, శ్రీధర్, దాస్, చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ, కిశోర్, గోవిందులతోపాటు ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరు చొప్పున కార్యవర్గ సభ్యులుంటారు.