● రూ.100 స్టాంపు ఫీజుతో అప్పనంగా కాంట్రాక్టు ● రూ.99లక్షల పనుల పేరుతో రూ.కోట్ల సై‘ఖతం’ ● 10 ట్రాక్టర్లకు అనుమతి తీసుకుని 200 టిప్పర్లతో తరలింపు ● టన్నుకు రూ.100 రుసుము చెల్లించి.. తమిళనాడు, కర్ణాటకలో రూ.3వేలకు విక్రయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం పరిధిలో ఇసుక దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారపార్టీ అండతో యథేచ్ఛగా తవ్వి తమిళనాడు, కర్ణాటకకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అనుమతులు కొంతే ఉంటే.. అక్రమాలు కొండంతగా సాగిపోతోంది. జిల్లాలోని పిచ్చాటూరు, నాగలాపురం మండలాల పరిధిలోనిన్న ఆరణియార్ నదిలో పూడికతీత పేరుతో భారీగా ఇసుక అక్రమ తవ్వకం జరుగుతోంది. ఇందుకోసం సర్కారు పెద్ద పథకమే అమలు చేస్తోంది. అరణియార్ నదిలో భారీగా నాణ్యమైన ఇసుక నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి ఇసుకకు తమిళనాడు, కర్ణాటకలో మంచి డిమాండ్ ఉంది. అందులోని ఇసుకను ఎలాగైనా తవ్వి తరలించి సొమ్ముచేసుకునేందుకు టీడీపీ నేతలు పన్నాగం పన్నారు. ఇసుకను తవ్వి తరలిస్తే అక్రమ రవాణా అంటారని కొత్త పంథాను అనుసరించారు. నదిలో పూడికితీత పేరుతో దోపిడీకి పూనుకున్నారు. వరదలు వచ్చినప్పుడు సమీప గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఆ ప్రమాదం జరగకుండా ఉండేందుకు పూడిక తీత ఎత్తుగడ వేశారు. అనుకున్న వెంటనే.. చకచకా అనుమతులు ఇప్పించుకున్నారు. గుంటూరుకు చెందిన రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరున రూ.100 స్టాంప్ పత్రంపై రూ.99 లక్షల కాంట్రాక్టుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డీసిల్టేషన్’ పనులను అడ్డంపెట్టుకుని దోపిడీకి తెగబడ్డారు. ఇందుకు శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్ ఒప్పందమే ప్రత్యక్ష ఉదాహరణ. పేరుకు పూడికతీత.. తెరవెనుక జరుగుతోంది మాత్రం రూ.కోట్ల ఇసుక దందా.
భద్రతపై బాధ్యత లేదు
గుంటూరు సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో 14వ నిబంధనపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. పూడికతీత పనుల్లో అవాంఛనీయ ఘటన, ప్రమాదం, మరణం సంభవిస్తే తమకు సంబంధం లేదని, ఏజెన్సీదే పూర్తి బాధ్యతని ప్రభుత్వం పేర్కొనడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కార్మికుల భద్రతపై తమకు బాధ్యత లేదని సర్కారు తప్పుకోండం సరికాదని స్పష్టం చేస్తున్నాయి.
అసలు దోపిడీ ఇక్కడే..
నిజానికి నదిలో మేట వేసిన ఇసుకను తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ఈ పనుల లక్ష్యం. కానీ టీడీపీ సర్కార్ మాత్రం ఈ పవిత్రమైన పనిని కూడా కమీషన్ల కక్కుర్తికి వాడుకుంటోంది. గుంటూరుకు చెందిన రఘురామ్ హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 99 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కారుచౌకగా కట్టబెట్టింది. అరణియార్ నదిలో ఇసుక దోపిడీకి ఈ ఏడాది మే 15వ తేదీన శ్రీకాళహస్తి ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో బీజం పడింది. పూడికతీత పనుల ముసుగులో ఇసుక దోపిడీకి ఇరిగేషన్ శాఖ ద్వారా ఒప్పందం కుదిరింది. కేవలం రూ.100 స్టాంప్ డ్యూటీ మాత్రమే చెల్లించి, ఏకంగా రూ.99 లక్షల కాంట్రాక్టును ఆ సంస్థ దక్కించుకుంది. ఈ ఒప్పందంలో సురుటుపల్లె సమీపంలోని అరణియార్ నది ఎగువ భాగంలో డీసిల్టేషన్, రవాణా, నిల్వ, లోడింగ్‌కు సంబంధించి 6.76 హెక్టార్లు విస్తీర్ణంలో 99 వేల మెట్రిక్ టన్నులు తరలించేందుకు రఘురాం హ్యూమ్ పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అనుమతులు మంజూరు చేసింది. ఈ వివరాలు బయటకు పొక్కడంతో స్థానికులు ఇసుక తరలింపును అడ్డుకున్నా టీడీపీ నేతలు లెక్కచేయలేదు.
కాగితాలకే పరిమితం
డస్ట్ కంట్రోల్‌కు నీళ్లు చల్లడం, వాహనాల వేగం 80 కిలోమీటర్లలోపునే నడపడం, లారీలపై టార్ఫాలిన్ కవర్ తప్పనిసరి. శబ్ధ కాలుష్యం 55 డెసిబెల్స్ మించకూడదు. ప్రతి నెలా గాలి, నీటి నాణ్యత నివేదికలను కాలుష్య నియంత్రణ మండలికి సమర్పించాలనే పేజీల కొద్దీ నిబంధనలు ఒప్పందంలో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో ఈ నిబంధలను పట్టించుకునే నాథుడే లేడు. దుమ్ము, ధూళితో పరిసర గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నది గట్లు కోతకు గురై పంట పొలాలు దెబ్బతింటున్నాయి. జాతీయ హరిత ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న స్థానికులు(ఫైల్)


