తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు వెల్లడించారు. ఆదివారం వారు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661కు ఫోన్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావచ్చని తెలిపారు. కాల్ చేసే సమయంలో వినియోగదారులు తప్పనిసరిగా విద్యుత్ సర్వీస్ నంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి పాక్‌శాస్త్రి కోర్సులతో పాటు, యూజీ(శాస్త్రి) 3, 4 సంవత్సరాల కోర్సుల్లోనూ, అలాగే 17 విభాగాలలో పీజీ (ఆచార్య) 1, 2 సంవత్సరాల కాలవ్యవధి కోర్సుల్లోనూ, పీహెచ్‌డీ (విద్యావారధి) కోర్సుల్లోనూ ప్రొఫెషనల్ కోర్సులైన ఐటీఈపీ (బీఏ, బీఈడీ), బీఈడీ (శిక్షా శాస్త్రి), ఎమ్‌ఈడీ (శిక్షా ఆచార్య) కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు సోమవారంతో ముగియనుండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువును ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 7382595500, 7382585500 నంబర్ల నందు సంప్రదించాలని అధికారులు సూచించారు.
వేగవంతం.. అనుసంధానం
తిరుపతి రూరల్ : ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై ఏర్పాటు చేస్తున్న రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్‌ను గ్రిడ్‌కు అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశించారు. ఆదివారం రేణిగుంట మండలం వెదుళ్లచెరువు సాగుతున్న అనుసంధాన ప్రక్రియను ఆయన పరిశీలించారు. సీఎండీ మాట్లాడుతూ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నోడల్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కోరారు. డైరెక్టర్ పి.అయూబ్‌ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఉమాపతి, తిరుపతి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ వి.చంద్రశేఖర రావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జయప్రకాష్, సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పుణ్యకోటి, మల్లికార్జున పాల్గొన్నారు.


