కనిపించవా.. కల్కీ! | - | Sakshi
Sakshi News home page

కనిపించవా.. కల్కీ!

Jun 15 2026 7:40 AM | Updated on Jun 15 2026 7:40 AM

● తనయుడు కృష్ణాజీ, కోడలు ప్రీతాజీ రంగప్రవేశం ● సంక్రాంతి రోజున సైతం ముక్తి గురువుగా కృష్ణాజీ ఉపదేశం

కొన్నేళ్లుగా దర్శనమివ్వని భగవాన్‌

వరదయ్యపాళెం : ఆధ్యాత్మికవాదిగా పేరుపొందిన కల్కి అమ్మా భగవాన్‌ దర్శన భాగ్యం ఇక భక్తులకు దూరమేనా అంటే అది నిజమే అన్నట్టు ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. భక్తులకు నేరుగా దర్శనమిచ్చి, ఇతర కార్యక్రమాల్లో భగవాన్‌ పాల్గొని కొన్నేళ్లు గడిచిపోయాయి.. కొద్దిరోజుల పాటు ఆయన అనారోగ్యమే కారణంగా చెప్పుకొచ్చారు. అయితే తాజా ఘటనలను పరిశీలిస్తే భగవాన్‌ దర్శనం ఇక భక్తులకు ఉండదనే తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా భగవాన్‌ తనయుడు కృష్ణాజీ, కోడలు ప్రీతాజీ ఆధ్యాత్మిక ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకుంటున్నారు. నేరుగా భక్తులకు దర్శనాలు ఇస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలు కృష్ణాజీ కనుసన్నల్లోనే జరుగుతుండడం గమనార్హం.

ముక్తి గురువుగా దర్శనం

వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం వద్ద గల ఏకం ఆలయంలో సంక్రాంతి సందర్భంగా భగవాన్‌ తనయుడు కృష్ణాజీ ముక్తి గురువుగా దర్శనమిచ్చారు. పదేళ్లుగా భక్తుల ముందుకు రాకుండా ఆన్‌లైన్‌ తరగతులు, ఇతర సేవా కార్యక్రమాలను తెర వెనుక నుంచి నడుపుతున్న కృష్ణాజీ, ప్రీతాజీ దంపతులు ఇప్పుడు భక్తుల ముందుకు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఆధ్యాత్మిక వారసత్వం ఇక ఈ దంపతులదేనని సమాచారం. ఈ క్రమంలోనే భగవాన్‌ శిష్యులుగా ఉన్న సీనియర్‌ దాసాజీలను సైతం పిలిపించుకునే పనిలో ఉన్నట్లు తెలిసింది. ఆ దిశగా ప్రస్తుతం ఆచార్య ఆనందగిరీజీ, ఆచార్య సమదర్శినిజీ సైతం కృష్ణాజీ వెంట ఉండడం గమనార్హం.

చివరగా 74వ జన్మదినోత్సవాన..

భగవాన్‌ ఆధ్యాత్మిక ప్రస్థానం 1989 నుంచి ప్రారంభం కాగా, వరదయ్యపాళెం ప్రాంతానికి 1997లో వచ్చారు. బత్తలవల్లంలో ఏకం ఆలయం నిర్మించారు. భగవాన్‌ నివాసం సైతం అక్కడే ఉండేది. చివరగా తన 74వ జన్మదినోత్సవమైన 2023 మార్చి 7న రాత్రి 50వేలకు పైగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆయన ఏకం ప్రాంగణంలోనే కనిపించలేదు. తమిళనాడు నేమం వద్ద ఉన్న అమ్మా భగవాన్‌ ఆశ్రమంలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం.

కలసిరాని ఆలయం

బత్తలవల్లంలో భారీ బడ్జెట్‌తో కనీవినీ ఎగుగని రీతిలో పాలరాతి బండలతో సకల హంగులతో ఏకం ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆధ్యాత్మికత క్షేత్రానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు రావడంతో వరదయ్యపాళానికి సైతం ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. అయితే ఈ ఆలయం 2006లో ప్రారంభమైంది. అయితే ప్రారంభం రోజునే అపశృతి జరిగింది. ఒకేరోజు 5లక్షలకు పైగా భక్తుల రావడంతో ఆలయ ప్రారంభం తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే భారీ తొక్కిసలాట జరిగి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆశ్రమ నిర్వాహకులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆలయాన్ని మూసివేసింది. తర్వాత కొన్నేళ్లకు ఏకం ఆలయంలో దర్శనాలు ప్రారంభమయ్యాయి. 2012 తర్వాత భగవాన్‌కు అనారోగ్య సమస్యలు రావడం శిష్యుల మధ్య అంతర్గత కలహాలు, అదే సమయంలో ఐటీ దాడులు, ఈడీ కేసులు వంటివి చుట్టుముట్టాయి. దీంతో పూర్తిస్థాయిలో కోలుకోలేక ఆశ్రమం ఉనికిని చాటుకోవడమే కష్టతరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement