తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం కేంద్ర మంత్రి శోభా కరండ్లజే దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
గంజాయి నిర్మూలనే లక్ష్యం
చంద్రగిరి : గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఆదివారం ఈ మేరకు చంద్రగిరి ప్రభుత్వ బాలుర పాఠశాల సమీపంలో పలువురు యువకులు, స్థానికేతరులకు యూరిన్ టెస్టును నిర్వహించారు. సుమారు 110 మందిని పరీక్షించగా 10 మందికి పాజిటివ్‌గా వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయిపై యూరిన్ టెస్టులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ పరీక్షల ద్వారా ఆరు నెలల వరకు ఎప్పుడు గంజాయి సేవించినా తెలుస్తుందన్నారు. వీరి ద్వారా గంజాయి విక్రేతలను గుర్తించి మూలాలను నాశనం చేయవచ్చని వెల్లడించారు. డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ గంజాయి ముఠాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. ఎస్‌ఐలు రవి ప్రకాష్ రెడ్డి, మురళీమోహన్, అరుణాచలం పాల్గొన్నారు.
తిరుమలలో గుర్తుతెలియని మృతదేహం
తిరుమల: తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ (ఆల్వార్ చెరువు) పడమర భాగంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు తిరుమల టూ టౌన్ సీఐ శ్రీరాముడు తెలిపారు. నీటిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించగా, సుమారు 35 ఏళ్ల వయస్సు గల పురుషుడిగా గుర్తించినట్లు చెప్పారు. మృతుడు డార్క్ బ్లూ జీనన్స్ ప్యాంట్, లైట్ బ్లూ ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి నాలుగు నుంచి ఐదు రోజుల క్రితమే నీటిలో పడి మృతి చెందినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌వీఆర్‌ఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే తిరుమల టూ టౌన్ పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని సీఐ శ్రీరాముడు కోరారు. 9392101923, 9440796772 నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని సూచించారు.
పాముకాటుతో మహిళ మృతి
వరదయ్యపాళెం : మండలంలోని పెద్దపాండూరు పంచాయతీ సిద్ధేశ్వరపురంలో జమున (45) అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. ఆదివారం వేకువజామున విద్యుత్ నిలిచిపోవడంతో ఇంట్లో చీకటిగా ఉంది. ఈ సమయంలో ఇంట్లో చొరబడిన నాగుపాము ఆమెను కాటు వేసిందని కుటుంబీకులు వెల్లడించారు. వెంటనే చిన్న పాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం కోసం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించిందని తెలిపారు.
ప్రాణాలు తీసిన లారీ!
రైల్వేకోడూరు: రైల్వేకోడూరులోని మామిడికాయల మండీ వద్ద ఆదివారం వేకువజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండీలో పనిచేస్తున్న రవి(22) అనే కార్మికుడు స్థానికంగా మండీలు కాయలు దింపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం వేకువ జామున మండీ వద్దే నిద్రిస్తుండగా ఓ లారీ వెనుకకు రివర్స్ వస్తూ అతనిపైకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మండీలో కనీస వసతులు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు సీహెచ్ చంద్రశేఖర్, జాన్‌ప్రసాద్, రాజశేఖర్ డిమాండ్ చేశారు.


